Vedapathashala In Gutta: యాదగిరిగుట్టకు వేదపాఠశాలమంజూరైంది. అందుకు ప్రభుత్వం 15 ఎకరాల భూమిని సైతం కేటాయించింది. నిధులు సైతం మంజూరు చేసింది. త్వరలోనే భూమిపూజకు సన్నాహాలు చేస్తున్నారు. తేదీని కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ పాఠశాల ఒక మైలురాయిగా నిలువనుంది.
యాదగిరిగుట్టను ప్రభుత్వం మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ఆలయానికి 1241 ఎకరాల భూమి ఉంది. దీనిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 15 ఎకరాల భూమిని వేదపాఠశాలకు కేటాయించారు. ప్రభుత్వం నుంచి కూడా అప్రూవల్ వచ్చిందని అధికారులు తెలిపారు.
ఆధ్యాత్మికతతో కూడిన మౌలిక వసతులతో నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 23.78కోట్లను కేటాయిస్తూ జీవో సైతం ఇచ్చింది. అయితే ఇందులో సీజీఎఫ్(కామన్ గుడ్ ఫండ్) నిధుల నుంచి రూ.13.78కోట్లు కేటాయిస్తున్నారు. మిగిలిన రూ.5కోట్ల నుంచి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్ ఫండ్ (వైటీడీఏ) నుంచి కేటాయించారు. ఆలయానికి సమీపంలోనే వేదపాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు.
Also Read; JAC Lacchi Reddy: ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
త్వరలోనే భూమి పూజ
వేదపాఠశాల భవన నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. సీఎం, మంత్రులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా పనులు ప్రారంభింపజేయాలని భావిస్తున్నట్లు ఈలయ ఈఓ భాస్కర్ రావు తెలిపారు. త్వరలోనే మంత్రి కొండా సురేఖతో పాటు ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 15 ఎకరాల భూమిని అప్పగించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం రాయగిరిలో ప్రతిపాదన
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాయగిరిలో వేదపాఠశాల నిర్మించాలని భావించింది. అందుకు సంబంధించి ప్రణాళికలు సైతం రూపొందించింది. ఆ బాధ్యతలను చిన్న జీయర్ కు అప్పగించింది. ఆతర్వాత కేసీఆర్ కు, చిన్నజీయర్ స్వామికి మద్య గ్యాప్ రావడంతో వేదపాఠశాల పెండింగ్ పడింది.
కేసీఆర్ సైతం పాఠశాలపై ఆసక్తి చూపలేదు. పనులు ముందుకు సాగలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యాదగిరిగుట్టలో వేదపాఠశాల నిర్మిస్తే విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు సైతం అనుకూలంగా ఉంటుందని భావించి నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక భవనను సైతం విద్యార్థుల్లో పెంపొందించవచ్చని టెంపుల్ సిటీలో హెలీప్యాడ్ సమీపంలోనే 15 ఎకరాల భూమికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సంస్కృతిక పాఠశాల సైతం…
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో సంస్కృతిక పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలను కూడా టెంపుల్ సిటీలో నిర్మించబోతున్న వేదపాఠశాల వద్దనే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రెండూ ఒకేచోట ఉంటే విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని, వేదవిద్య, సంస్కృతిక విద్యను ఏకకాలంలో నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు మరింత అనుకూలంగా ఉండటమే కాకుండా ప్రయాణపరమైన ఇబ్బందులు రావని పేర్కొంటున్నారు.
ఆలయ ఈఓ భాస్కర్ రావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే ఓకే చోట వేదపాఠశాల, సంస్కృతి పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. ఏది ఏమైనా వేదపాఠశాల ఆలయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలువనుంది. గుట్టలో మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ప్రభుత్వం ఆలయాలాభివృద్ధికి తీసుకుంటున్న ప్రత్యేక చొరవతోనే గుట్టకు వేదపాఠశాల అని పలువురు పేర్కొంటున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు