Tele MANAS: మానసిక సమస్యలతో బాధపడే బాధితులకు టెలీ మానస్ భద్రతగా పనిచేస్తున్నది. ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న బాధితులు టెలీమానస్‌ను సంప్రదిస్తే, ఆ సమస్య నుంచి బయట పడే మార్గాన్ని పొందుతున్నారు. సైక్రియాట్రిస్టులు ఇచ్చే కౌన్సెలింగ్ ద్వారా బాధితుల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏకంగా 1700 మంది ప్రాణాలను సేఫ్ చేసినట్లు టెలీ మెంటల్ హెల్త్ సర్వీసెస్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. ఇందులో అత్యధికంగా 18 నుంచి 45 ఏజ్ గ్రూప్ వాళ్లే ఉన్నారు. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలతో సతమతం, పరీక్షలు, లవ్ ఫెయిల్యూర్స్, ఒంటరితనం, ఇలా తదితర సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకోవాలని భావించిన బాధితులను ఈ టెలీ మెడిసిన్ ద్వారా సక్సెస్ ఫుల్‌గా కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇలాంటి సమస్యలు ఉన్నోళ్లు టెలీ మెడిసిన్ టోల్ ఫ్రీ నెంబర్ 14416కు కాల్ చేస్తే పరిష్కారం లభిస్తుందని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్‌లకు కూడా అవకాశం ఇస్తున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్‌ను రాష్ట్రంలో ఉచితంగా అందజేస్తున్నారు. 24 గంటల పాటు ఈ కాల్ సెంటర్ వర్క్ చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.
గ్రౌండ్ స్టాఫ్‌తో కో ఆర్డినేషన్?
రాష్ట్రంలో అక్టోబర్ 2022లో టెలీమానస్ సెంటర్ ఏర్పాటు అయ్యింది. ప్రధాన కార్యాలయం ఎర్రగడ్డ నుంచి దీని ఆపరేటింగ్ జరుగుతున్నది. ఈ కేంద్రంలో 25 మంది స్టాఫ్ ఉండగా, ఇద్దరు సైక్రియాట్రిస్టులు, ఒక క్లినికల్ సైకాలజిస్టు, 14 మంది కౌన్సిలర్లు, ఇద్దరు టెక్నికల్ కో ఆర్డినేటర్స్, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్, మిగతా వారు సమన్వయం కోసం పనిచేస్తున్నారు. ప్రతి రోజు సగటున 150 నుంచి 200 కాల్స్‌ను రిసీవ్ చేసుకుంటున్నారు. బాధితుల బాధలను వింటూ కౌన్సెలింగ్ ద్వారా తగిన సలహాలు, సూచలను ఇస్తున్నారు. అవసరమైన వారికి మెడికేషన్ కూడా రిఫర్ చేస్తున్నారు. అంతేగాక రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తూ నెల వారీగా మార్పును చెక్ చేస్తున్నారు. గ్రౌండ్‌లోని ఆశాలు, ఏఎన్‌లతో ఈ పేషెంట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లోనూ టెలీ మానస్ నిర్వహిస్తున్నారు. అంతేగాక దూర దర్శన్, ఆల్ ఇండియా రేడియా ద్వారా కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 547 కాలేజీల్లో 31024 మంది విద్యార్ధులను స్క్రీనింగ్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో పాటు 942 స్కూళ్లలో 41,350 మంది విద్యార్ధులను పరీక్షించినట్లు చెప్పారు.
Read Also- WWII: 13 ఏళ్ల వయసులోని కోరిక.. 103 ఏళ్లకు తీరబోతోంది.. తాత మీరు సూపర్!
కామారెడ్డి టాప్.. ఆసిఫాబాద్ లాస్ట్
రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 22 నుంచి జూలై 2025 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,38,023 మంది టెలీ మెడిసిన్ కేంద్రాన్ని సంప్రదించారు. ఇందులో కామారెడ్డి జిల్లా నుంచి అత్యధికంగా 19,366 మంది కాల్స్ చేయగా, అతి తక్కువగా ఆసిఫాబాద్ జిల్లా నుంచి 1144 మంది వినియోగించుకున్నారు. ఇక మానసిక కేంద్రాన్ని సంప్రదించిన వారిలో పురుషుల కంటే మహిళలే రెట్టింపు స్థాయిలో ఉన్నారు. 92,013 మంది మహిళలు ఉండగా, 45,911 మంది పురుషులు వినియోగించుకున్నారు. అత్యధికంగా 18 నుంచి 45 వయస్సులు 73,163 మంది ఉండగా, 46 నుంచి 64 ఏజ్ గ్రూప్ వాళ్లు 42,641 మంది ఉన్నట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
బాధితుల సమస్యలు ఇలా…
సైకలాజికల్ సమస్యలతో- 23,022
స్ట్రెస్ సమస్యలతో- 21,592
యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ – 7,788
నిద్ర సమస్యలు – 19,232
నిత్యం మానసిక బాధ – 12,287
ఫ్యామిలీ సమస్యలు – 4,528
సూసైడ్ కమిట్‌తో – 1,711
ఆరోగ్యసమస్యలు – 44,255
ఇతర కారణాలు – 3,608
Read Also- Medical Colleges: మెడికల్ కాలేజీల స్టైఫండ్ ఇష్యూ.. ప్రభుత్వం కీలక నిర్ణయం