Ponnam Prabhakar: రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పెంచాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్కూళ్లలో విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో చేపట్టిన కార్యక్రమాలను పాఠశాలల్లో నిరంతరం కొనసాగించాలని, ప్రతి స్కూల్‌లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులు ఏర్పాటయ్యేలా రవాణా శాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచించారు.
వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనందున, నిరంతరం స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ తనిఖీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-పాలసీ మంచి ఫలితాలనిస్తుందని, ప్రజలు ఎక్కువగా ఈ-వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారని అధికారులు మంత్రికి వివరించారు.
Also Read: Maoist Encounter: అడవుల్లో కాల్పుల మోత.. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ!
ఆర్టీసీ బలోపేతం..
ఆర్టీసీలో ఇప్పటి వరకు 186.5 కోట్ల మంది మహిళలు రూ.6222 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాన్ని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతానికి ఆర్టీసీ ఉద్యోగుల శ్రమను ఆయన అభినందించారు. ఉద్యోగుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత తమ తొలి ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ( Hyderabad)హైదరాబాద్‌లో నడిచే ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రయత్నంలో వాటి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల వారి ఆదాయం ఆదా అవడంతో పాటు మహిళా సాధికారత దిశగా తెలంగాణ ( Telangana) ప్రజా పాలన ప్రభుత్వం అడుగులు వేస్తుందని పేర్కొన్నారు.
గురుకులాల్లో వంద శాతం..
గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ఒక్క గురుకులంలో కూడా ఖాళీ సీట్లు కనిపించకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు ఇప్పటికే అందజేయాలని తెలిపారు. గురుకులాల్లో అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం గత సంవత్సరం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన తర్వాత గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, గురుకుల సెక్రటరీ సైదులు, రవాణా శాఖ జేటీసీలు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, రమేశ్, ఆర్టీసీ అధికారులు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Also Read: Ranga Reddy District: పక్కదారి పడుతున్న గోధుమలు.. సందట్లో సడేమియాలా డీలర్ల తీరు!