Mallu Bhatti Vikramarka: భారీగా పెట్టుబడులు పెడుతూ యువతకు ఉపాధి, పండ్ల సాగు చేసే రైతులకు ప్రోత్సాహం కలిగించే పద్ధతుల్లో బహుళ జాతి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నాయని డిప్యూటీ సీఎం, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు (Mallu Bhatti Vikramarka) అన్నారు. సచివాలయంలో మంగళవారం ఇండస్ట్రియల్ ప్రమోషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాల ఆసక్తి చూపుతున్న జెఎస్డబ్ల్యూ, యూఏవీ ప్రైవేట్ లిమిటెడ్ మహేశ్వరంలో కొత్త యూనిట్ ప్రారంభించడానికి, తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, గ్యాస్ ఇన్సులేటివ్ స్విచ్ గేర్ , బుషింగ్స్ పరిశ్రమ ఏర్పాటుకు, హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ కంపెనీ ఏర్పాటుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది.
Also Read: Medak District Rains: మెదక్ ఉమ్మడి జిల్లాలో వర్షం బీభత్సం.. నీటమునిగిన వేలాది ఎకరాల పంట
3,745 కోట్ల రూపాయల పెట్టుబడులు
రాష్ట్రంలో ఈ మూడు భారీ కంపెనీల ఏర్పాటు ద్వారా 3,745 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,518 మంది యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రుల బృందం తెలిపింది. సుమారు 2,398 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కోకా కోలా బేవరేజెస్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తుందని, 785 కోట్లతో రూపాయల పెట్టుబడితో వస్తున్న జేఎస్డబ్ల్యూ కంపెనీ ద్వారా 364 మందికి ఉపాధి లభిస్తుందని, 562 కోట్ల రూపాయల పెట్టుబడి తో వస్తున్న తోషిబా కంపెనీ ద్వారా 554 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కోకా కోలా వంటి కంపెనీల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో మామిడి, నారింజ సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఏర్పడుతుందన్నారు.
నారింజ వంటి పంటలు సాగు ఉత్పత్తులకు డిమాండ్
బేవరేజెస్ పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యాన పంటల ఉత్పత్తులు ఆయా కంపెనీలకు అవసరం అవుతాయని, రాష్ట్రంలో మామిడి, నారింజ వంటి పంటలు సాగు ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడి రాష్ట్ర రైతులకు గణనీయంగా ఆదాయం సమకూరుతుందన్నారు. దావోస్ తో పాటు వివిధ దేశాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన వివిధ కంపెనీలు జరిగిన ఎంఓయూలు, విధి విధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు సమీక్షించారు. సమావేశంలో మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి , కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Medak District: మెదక్ జిల్లాలో ఘోర సంఘటన.. ఏడాదిన్నర దూడపై యువకుడి అఘాయిత్యం