Minister Sridhar Babu: లైఫ్ సైన్సెస్‌లో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) చెప్పారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్‌బయోటెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తున్న ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025(Asbiotech International Conference 2025’)’లో ఆయన గురువారం కీలకోపన్యాసం చేశారు. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించారు. తెలంగాణను ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్(‘Global Life Sciences Hub’)’గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను ప్రస్తుతం ఉన్న 80 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే ‘కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ’ని అందుబాటులోకి తెస్తామన్నారు.
లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్‌కు చోటు
ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ రూపొందించిన ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్‌కు చోటు దక్కిందన్నారు. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యో సరసన నగరం నిలిచిందన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే అని అన్నారు. లైఫ్ సైన్సెస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు ఉండగా.. 2024లో ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగులకు చేరిందన్నారు.
Also Read: K Ramp collections: మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన కిరణ్ అబ్బవరం ’కే ర్యాంప్’.. ఎంతంటే?
మా నినాదం మేడిన్ ఇండియా కాదు..
లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాబోయే ‘బయో-డిజిటల్’ యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. మా నినాదం మేడిన్ ఇండియా కాదు.. ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అని స్పష్టం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమని ముందుకు రావాలని ఆస్ట్రేలియా కంపెనీలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సదస్సు ‘విక్టోరియా–తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్’కు నాంది పలకాలని ఆకాంక్షించారు. రాబోయే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని దిగ్గజ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను ఆహ్వానించారు.
Also Read: Asim Munir: ‘నువ్వు మగాడివైతే మాతో పెట్టుకో’.. పాక్ ఆర్మీ చీఫ్‌కు తాలిబన్స్ సవాల్!
