Bhatti Vikramarka: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ, రైతులు, సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పునరుద్ఘాటించారు. శాసన మండలిలో సోమవారం జరిగిన క్వశ్చన్ హవర్‌లో విద్యుత్ శాఖపై జరిగిన చర్చకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తూనే, ఆధునిక సాంకేతికతతో విద్యుత్ శాఖను ప్రజల ముంగిటకే తీసుకెళ్తున్నామని ఆయన వివరించారు. 2022 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, ఏకంగా 3,44,462 మంది రైతులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు కల్పించినట్లు తెలిపారు. కనెక్టెడ్ లోడ్ కనెక్షన్లకు అనుగుణంగా 75,686 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు.
విద్యుత్ అంబులెన్స్‌లు..
ఇదిలా ఉండగా, విద్యుత్ అంతరాయం కలిగితే గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ‘108’ తరహాలో విద్యుత్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, థర్మల్ విజన్ కెమెరాలతో కూడిన వాహనం క్షేత్రస్థాయికి చేరుకుంటుందని తెలిపారు. విద్యుత్ అధికారుల ‘ప్రజా బాట’ కార్యక్రమంలో అధికారులు వారానికి మూడు రోజులు పొలాల్లోనే ఉండి వంగిన స్తంభాలను, వేలాడుతున్న తీగలను సరిచేస్తున్నారని చెప్పారు.
పీఎం కుసుమ్ పథకంపై వివరణ
తెలంగాణలో సౌర విద్యుత్ వినియోగాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితమే ‘పీఎం కుసుమ్’ పథకాన్ని ప్రారంభించినప్పటికీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఈ పథకం అమలు కాలేదని వివరించారు. ఈ పథకం కింద గరిష్టంగా కనెక్షన్లు సాధించేందుకు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మిగిలిపోయిన కోటాను కూడా తెలంగాణకే కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
రైతులకు సోలార్ ప్రోత్సాహం
వ్యవసాయ రంగంలో సోలార్ విప్లవం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నామని, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు గ్రూపులుగా ఏర్పడి సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించామని గుర్తుచేశారు. రైతులకు ఇప్పటికే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుండటంతో, వ్యవసాయ కనెక్షన్లకు సోలార్ ఏర్పాటు చేసుకునేలా వారిని చైతన్యపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని భట్టి తెలిపారు. సభ్యులు ఏదైనా సమస్యను తన దృష్టికి తెస్తే, కేవలం 24 గంటల్లోనే పరిష్కరిస్తామని సభలో ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Bhatti Vikramarka: మధిర నుంచే దేశానికి దిశా నిర్దేశం.. డిప్యూటీ సీఎం భట్టి హామీ

