Telangana Sports Hub: ఖేలో ఇండియా(Khelo India), కామన్ వెల్త్(Commonwealth), ఒలింపిక్స్(Olympics) ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్(Telangana Sports Hub) తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగుపర్చడం, కోచ్‌లు, ట్రైనర్‌లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన, అమలుకు సబ్ కమిటీల ఏర్పాటుకు బోర్డు తీర్మానాలు చేసింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశం హైదరాబాద్‌లో(Hyderabada) జరిగింది. సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి(Revanth Redy) మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమన్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు
క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణకు ఐటీ(IT) సంస్కృతి ఉందని… రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారని… అలానే క్రీడా సంస్కృతి రావాలని తాను అభిలషిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడా రంగం ప్రోత్సాహానికిగానూ గతంతో పోల్చితే 16 రెట్లు బడ్జెట్ పెంచామని సీఎం వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు. క్రీడా రంగం ప్రాధాన్యతను పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ(Young India Sports University)ని ఏర్పాటు చేశామన్నారు.
Also Read: BRS Party: నేతల కోసం గులాబీ వేట?.. పార్టీలో చేరినవారికి పదవుల ఆఫర్!
మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్టేడియాలు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని, వాటిని సమగ్రంగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు క్రీడా రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు బోర్డు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం కోరారు. ఇక క్రీడా రంగం అభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరమైనందునే బోర్డులో ప్రముఖ కార్పొరేట్లు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించామని సీఎం తెలిపారు. ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ తొలుత క్రీడా సంస్కృతిని పెంపొందించాలని.. ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయని అభిప్రాయపడ్డారు. హర్యానాలో కుస్తీతో ప్రతి క్రీడకు పల్లెల్లో చోటు ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోని బాల దేవి తదితరులు పాల్గొన్నారు.
Also Read: PM China Tour: ప్రధాని మోదీ చైనా పర్యటనపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు