Mee Seva: రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీని మరింత వేగవంతం చేస్తూ, ప్రజలకు సులభతరం చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) తెలిపారు. మీసేవ (Mee Seva) ద్వారా ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన 15 రోజుల్లోనే 17,500 మందికి పైగా లబ్ధి చేకూరిందని, ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది ఈ మార్పులతో ప్రయోజనం పొందనున్నారని వెల్లడించారు. కొత్త విధానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కుల ధ్రువీకరణ పత్రం మళ్లీ తీసుకునేటప్పుడు ప్రతి సారి ఆమోద ప్రక్రియకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మీసేవ కేంద్రాల్లోనే నేరుగా పత్రాలు జారీ అవుతాయని, అయితే 2020 సెప్టెంబర్ 9న జారీ చేసిన జీ.ఓ.ఎమ్.సంఖ్య 3 ప్రకారం హిందూ ఎస్సీ వర్గానికి చెందిన వారు క్రైస్తవ మతంలోకి మారి బీసీ-సీ వర్గంలోకి వచ్చే ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పూర్వపు ఆమోద విధానం అమల్లోనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
ప్రజలకు వేగంగా, నిశ్చితంగా సేవలు అందించడమే మా ఉద్దేశ్యం అన్నారు. అవసరం లేని ఆమోదాలు తొలగిస్తూనే ప్రత్యేక సందర్భాల్లో కఠినతర పరిశీలన కొనసాగుతుందని మంత్రి తెలిపారు. కొత్తగా జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రంలో మొదటిసారి ఆమోదం తెలిపిన అధికారిపేరు, కొత్త జారీ తేదీ ఉంటాయన్నారు. పాత సర్టిఫికేట్ నంబర్ తెలిసినవారు వెంటనే ముద్రణ పొందవచ్చు అని, గుర్తు లేకపోతే జిల్లా, మండలం, గ్రామం, ఉపజాతి, పేరుతో శోధన చేసి పత్రం ఇస్తారన్నారు. పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు వంటి సవరణల కోసం మాత్రం జిల్లా అధికారికి ఫిర్యాదు చేసి, కొత్త దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సీసీఎల్‌ఏ, బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమ శాఖలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లతో జరిగిన సంప్రదింపుల తర్వాత ఈ మార్పులు అమల్లోకి వచ్చాయని వివరించారు. వివరాలకు మీసేవ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా సమీప మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు అని సూచించారు.
మానసిక సమస్యలకు టెక్నాలజీ పరిష్కారం.. హోప్ ఐ’ని ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల సామర్థ్యం టెక్నాలజీకి ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఏఐ ఆధారిత మెంటల్ హెల్త్ సపోర్ట్ సిస్టం ‘హోప్ ఐ’ ను ఆయన బుధవారం రాయదుర్గం లోని టీ హబ్ లో ఆవిష్కరించారు. ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణ తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఆవిష్కరణలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఆ దిశగా దృష్టి సారించి ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవాలని యువ ఆవిష్కర్తలకు సూచించారు. కార్యక్రమంలో టీ హబ్ సీఈవో కవికృత్, సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఛైర్మన్ ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Meeseva: ఈ సర్టిఫికెట్లు జారీ చేయడంలో మీ సేవ కీలకపాత్ర