TG in Top: లబ్ధిదారులకే పోషకాహారం చేరేలా ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ
75 శాతం లబ్దిదారులకు టేక్ హోమ్ రేషన్
కేంద్ర పోషన్ ట్రాకర్‌లో వెల్లడి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అంగన్వాడీ సేవల్లో తెలంగాణ ప్రభుత్వం మరో ఘనత (TG in Top) సాధించింది. లబ్ధిదారులకు నిజమైన, పారదర్శకతతో పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధునిక సాంకేతికత చక్కటి ఫలితాలను ఇస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు పోషణ్ ట్రాకర్ యాప్‌లో రికగ్నిషన్ సిస్టమ్‌ను (ఎఫ్ఆర్ఎస్) సమగ్రంగా అనుసంధానం చేసింది. దీంతో, అంగన్వాడీ సేవల్లో అగ్రగామిగా నిలిచింది. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌తో లబ్ధిదారులకే సరుకులు అందుతున్నాయన్నారు. పోషకాహారం పంపిణీని ఈ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చివేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, లక్ష్యాన్ని 90 శాతం కంటే ఎక్కువ సాధించామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి, ప్రతి తల్లికి సరైన సమయానికి పోషకాహారం చేరేలా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలనిస్తున్నాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీ సేవల్లో ఎఫ్ఆర్ఎస్ వినియోగంతో ప్రగతిని సాధించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
Read Also- HHVM OTT: షాకింగ్ సర్‌ప్రైజ్.. ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘వీరమల్లు’.. ఇంకొన్ని గంటల్లోనే!
ఏంటీ పోషన్ ట్రాకర్?
అంగన్వాడీ సిబ్బంది.. లబ్ధిదారుల వివరాలు తొలిసారి నమోదు సమయంలో ఈ-కేవైసీ, లైవ్ ఫొటో క్యాప్చర్ ద్వారా నమోదు చేస్తారు. ఆ తర్వాత, ప్రతినెలా టేక్ హోమ్ రేషన్ (టీహెచ్ఆర్) పంపిణీ సమయంలో ఫేస్ మ్యాచింగ్ ప్రక్రియను అనుసరించి సరైన లబ్ధిదారుడికే సరకులు అందజేస్తారు. ఈ విధానంతో నిజమైన లబ్ధిదారులకే పోషకాహారం చేరుతుంది. పోషకాహారం పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శకత మరింత పెరుగుతుంది. తెలంగాణలో అంగన్వాడీల ద్వారా పోషకాహారాన్ని మెరుగు పరిచేందుకు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అయితే లబ్దిదారులకే పోషకాహరం అందించాలన్న ఉద్దేశంతో ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని తెలంగాణలో పక్కాగా అమలు చేస్తున్నారు.
మంత్రి సీతక్క కృషి
వరుస సమీక్షలతో ఎఫ్ఆర్ఎస్ నమోదు శాతం పెరుగుదలకు మంత్రి సీతక్క కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 18,59,978 మంది టేక్ హోమ్ రేషన్ (టీహెచ్ఆర్) లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 74.32 శాతం మందికి ఇప్పటికే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పోషకాహారం పంపిణీ జరుగుతోందని కేంద్ర పోషన్ ట్రాకర్ ద్వారా వెల్లడైంది. లబ్ధిదారులే సద్వినియోగం చేసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకతను అమలు చేస్తోంది. ఈ విధానంలో పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార సరుకులు ఎలాంటి దారి మళ్లింపులు లేకుండా నేరుగా లబ్ధిదారుల చేతికి చేరుతున్నాయి. ప్రభుత్వం దీన్ని ఇంకా విస్తరించి 90 శాతం కవరేజ్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆ దిశగా అంగన్వాడీ సిబ్బందిని శిక్షణ ఇచ్చి, సాంకేతిక వనరులను మరింతగా వినియోగించేందుకు చర్యలు ప్రారంభించింది.
