Telangana Rising Global Summit: రంగంలోకి 2,686మంది పోలీసులు
అదనంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు (Telangana Rising Global Summit) పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీని కోసం 2,686మంది అధికారులు, సిబ్బందిని రంగంలోకి దింపారు. వీరికి అదనంగా గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బలగాలు కూడా బందోబస్తు విధుల్లో పాల్గొననున్నాయి. ఆర్మ్ డ్ రిజర్వ్ డ్, స్పెషల్ పార్టీ పోలీసులు కూడా భద్రతా విధులు నిర్వర్తించనున్నాయి. సమ్మిట్ జరుగనున్న ప్రధాన ప్రాంగణం, ఇంటర్నల్ ఈవెంట్ ఏరియా, ఎగ్జిబిషన్ హాల్, డెలిగేట్ల మీటింగులు జరిగే ప్రాంతాల్లో ముగ్గురు అదనపు డీజీపీలు, అయిదుగురు ఐజీపీలు, పదిమంది ఐపీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే సమ్మిట్ సందర్భంగా చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చూసేందుకు పోలీసు ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. సమ్మిట్ జరుగనున్న ప్రాంతంతోపాటు అక్కడికి చేరుకునే రహదారులను 18 సెక్టార్లుగా విభజించారు. వస్తున్న వీఐపీలు, వీవీఐపీలకు మూడంచెల భద్రత కల్పించనున్నారు. ఇక, ఎయిర్ పోర్టు నుంచి సమ్మిట్ జరుగనున్న మీర్ ఖాన్ పేట్ 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దారిలో ఆరు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆయా చెక్ పోస్టుల వద్ద ఓ డీసీపీ, ముగ్గురు ఏసీపీల చొప్పున పర్యవేక్షణలో జరుపుతారు. దక్షిణ, తూర్పు వైపుల నుంచి అనధికార ఎంట్రీలు జరగకుండా చూడటానికి అదనంగా మరో ఏడు చెక్ పోస్టులను పెట్టారు. ప్రధాన వేదికకు దక్షిణం వైపు వీవీఐపీలకు చెందిన వెయ్యి వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఆమెజాన్ గేట్ సెంటర్ వద్ద రెండు వేలు, టీజీఐఐసీ ప్లాట్ల వద్ద మరో వెయ్యి వాహనాలకు పార్కింగ్ వసతులు కల్పించారు. వీటికి అదనంగా టీజీఐఐసీ భూముల్లో మరో రెండు వేల వాహనాలను పార్క్ చేసేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ నిర్వహణ మొత్తాన్ని డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.
Read Also- Indigo Disruptions: ఇప్పటివరకు రూ.610 కోట్లు రిఫండ్.. ఇండిగో కీలక ప్రకటన.. మెరుగుపడుతున్న సర్వీసులు
హెలీ ప్యాడ్ వద్ద…
సమ్మిట్ జరుగనున్న ప్రాంతానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హెలీ ప్యాడ్ వద్ద డీసీపీ స్థాయి అధికారి పరిస్థితులను పర్యవేక్షిస్తారు. ఇక్కడ 24గంటలపాటు సాయుధ బలగాల పహారా ఉంటుంది. హెలీ ప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న నాలుగు జంక్షన్లు, ఇరవై అయిదు బై లేన్లు, నాలుగు యూ టర్నుల వద్ద పోలీసు సిబ్బంది మోహరించి ఉంటారు.
పరిసరాల్లోని గ్రామాల వద్ద…
సమ్మిట్ జరుగనున్న ప్రాంగణానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నుంచి ఎవ్వరూ నిరసనలు వ్యక్తం చేయటానికి రాకుండా చూసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు పని చేస్తాయి. చుట్టుపక్కల ఉన్న గుట్టలపై కూడా పోలీసులను మోహరించనున్నారు. ఇక, ఆయా రూట్లతోపాటు పార్కింగ్ కోసం కేటాయించిన ప్రాంతాల్లో 115 నైట్ విజన్, పీటీజెడ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ మెయిన్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానమై ఉంటాయి. డ్రోన్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు.
సేఫ్ హౌస్…
సమ్మిట్ ప్రాంగణానికి 5.6కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు పోలీస్ స్టేషన్ ను సేఫ్ హౌస్ గా గుర్తించారు. అలాగే 16.5కిలోమీటర్ల దూరంలో ఉన్న మాధవన్ జేఐ ఆస్పత్రిని అత్యవసర పరిస్థితుల్లో సేఫ్ హాస్పిటల్ గా నిర్ధారించారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం డీసీపీ స్థాయి అధికారిని మోహరించారు.
భద్రతా విధుల్లో ఉండే సిబ్బంది వివరాలివే
సమ్మిట్ సందర్భంగా లా అండ్ ఆర్డర్ విభాగానికి చెందిన 18మంది డీసీపీలు, 14మంది అదనపు డీసీపీలు, 39మంది ఏసీపీలు, 86మంది సీఐలు, 226మంది ఎస్ఐలు, 169మంది ఏఎస్ఐలు, 1,372మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధుల్లో ఉంటారు. ట్రాఫిక్ విభాగానికి చెంది 3 డీసీపీలు, 3 అదనపు డీసీపీలు, 7గురు ఏసీపీలు, 21మంది ఎస్ఐలు, 71మంది ఏఎస్ఐలు, 194మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉంటారు. యాక్సెస్ కంట్రోల్ సెక్యూరిటీ కోసం 1ఏసీపీ, 4గురు సీఐలు, 3ఎస్ఐలు, 5గురు ఏఎస్ఐలు, 103మంది కానిస్టేబుళ్లు పని చేస్తారు. కమ్యూనికేషన్ విధుల్లో 4గురు డీసీపీలు, 4గురు ఏసీపీలు, 8మంది సీఐలు, 16మంది ఎస్ఐలు, 25మంది ఏఎస్ఐలు, 90మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వీరికి అదనంగా 3 యూనిట్ల గ్రే హౌండ్స్, 3 యూనిట్ల ఆక్టోపస్ బలగాలు భద్రతా విధుల్లో ఉంటాయి. వీరికి అదనంగా 26 ప్లాటూన్ల ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ పోలీసులు 15 ప్లాటూన్ల స్పెషల్ పార్టీ పోలీసులు కూడా డ్యూటీలో ఉంటారు.

