Telangana Rising Summit: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 నేటి (డిసెంబర్ 8) నుంచి రెండ్రోజుల పాటు ఘనంగా జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబల్ గ్రహీతలు, వివిధ దేశాల ప్రతినిధులు సదస్సులో పాల్గొనున్న నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేస్తోంది. వీవీఐపీల కోసం ముడంచెల పటిష్ట భద్రతను అధికారులు సిద్ధం చేశారు. డిసెంబర్ 8-9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ సవ్యంగా సాగేందుకు తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు.
6000 పోలీసులతో భద్రత..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ ను నిఘా నీడలో అత్యంత భద్రత మధ్య తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందుకోసం 6000 పోలీసులను మోహరించింది. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ట్రాఫిక్ ఇతర విభాగాల పోలీసు సిబ్బంది.. సమ్మిట్ కు భద్రత కల్పించనున్నారు. అలాగే 1000 సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. డిజిటల్ సమ్మిట్ ప్రాంగణంలో మిని కంట్రోల్ రూమ్ ఇప్పటికే సిద్ధం చేశారు. మినీ కంట్రోల్ రూమ్ నుంచి రాచకొండ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానం కల్పించారు. వీటి ద్వారా భద్రతను ఉన్నతాధికారులు.. ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. అలాగే డ్రోన్ కెమెరాలు సైతం గ్లోబల్ సమ్మిట్ రక్షణలో భాగం కానున్నాయి. డ్రోన్స్ ద్వారా వీఐపీల భద్రత మానిటరింగ్ చేయనున్నారు.
సాధారణ ప్రజలూ సందర్శించొచ్చు
గ్లోబల్ సమ్మిట్ జరిగే 8, 9 తేదీల్లో పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ నిణుపులు, ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తారు. అయితే 10 – 13వ తేదీల మధ్య సాధారణ ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించారు. మరోవైపు ఈ సమ్మిట్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న నేపథ్యంలో అటు వెళ్లే అన్ని మార్గాల్లో ఆంక్షలు విధించారు. సమ్మిట్ ప్రాంగణం, సమీప ప్రాంతాలు, మార్గాలను 18 సెక్టార్లుగా విభజించి.. పోలీసులు బందోబస్తు అందిస్తున్నారు. అలాగే 1000 వాహనాలు నిలిపేలా వీవీఐపీ పార్కింగ్, 6 వేల వాహనాలు కోసం మూడు పార్కింగ్ జోన్లను ట్రాఫిక్ పోలీసులు సిద్ధం చేశారు. మరో 2 వేల వాహనాల కోసం రిజర్వు పార్కింగ్ ప్రాంతాన్ని అందుబాటులో ఉంచారు.
ఆందోళనకారులపై నిఘా..
ఫ్యూచర్ సిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమీప గ్రామాల ప్రజల నుంచి సమ్మిట్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ సిబ్బందితో కూడిన నాలుగు బృందాలు.. ఆయా గ్రామాల్లోని ఆందోళనకారులపై ఇప్పటికే నిఘా పెట్టాయి. అర్ధరాత్రి సైతం వీడియో రికార్డు చేసేలా 115 కెమెరాలు, పలు మార్గాల్లో పీటీజెడ్ కెమెరాలు, 10 డ్రోన్ బృందాలు అందుబాటులో ఉంచినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే సమ్మిట్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ముగ్గురు ఏసీపీలు, 50 మంది సిబ్బంది రెండ్రోజుల పాటు కమాండ్ కంట్రోల్ లో సిద్ధంగా ఉండనున్నారు.
Also Read: CM Revanth Reddy: పదేళ్ల ప్రభుత్వానికి సీఎం ప్రణాళిక.. ఓ పక్క అప్పులు తీరుస్తూ..!
మ. 1.30 గం.కు ప్రారంభం
హైదరాబాద్ ఫ్యూటర్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ ఇవాళ మ.1.30 గం.లకు అధికారికంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు ప్రారంభ సభలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభ ప్రసంగం చేయనున్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, పెట్టుబడులు, ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికుల గురించి వివరించనున్నారు.

