CM Revanth Reddy: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వివిధ విభాగాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. మంగళవారం తన నివాసంలో సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై రివ్యూ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ప్రిన్సిపల్ సెక్రెటరీలు శేషాద్రి, శ్రీనివాస రాజు, ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక, సందీప్ కుమార్ సుల్తానియా, ఈవీ నర్సింహ రెడ్డి, ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ, సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
భవిష్యత్‌పై విశ్వాసం కల్పించేలా బ్రాండింగ్
అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి అన్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను వీక్షించి పలు మార్పులు చేర్పులు సూచించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ భారత్ ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా మనం చేపట్టే పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలని అన్నారు.
Also Read: CM Revanth Reddy: ప్రజల్లోకి అభివృద్ధి పనులు.. స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డి ఫోకస్!
గ్రీన్‌ఫీల్డ్ హైవే, రైలు మార్గం
పెట్టుబడిదారులకు మనం కల్పించే సదుపాయాలను సమగ్రంగా వివరించాలన్నారు. హైదరాబాద్‌కు అనుకూలాంశాలైన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, రానున్న రీజినల్ రింగ్ రోడ్డు, బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే, రైలు మార్గం, డ్రైపోర్ట్‌తో పాటు తెలంగాణలోని కళా, సాంస్కృతిక, భాష, వాతావరణ అనుకూలతను వివరించాలని తెలిపారు. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి మార్పులేని అంశాన్ని, పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని సీఎం సూచించారు.
వైవిధ్యమైన రామప్ప ఆలయం
తెలంగాణ బ్రాండింగ్‌కు సంబంధించి మన రాష్ట్రానికే పరిమితమైన, వైవిధ్యమైన రామప్ప ఆలయంలోని నంది, సమ్మక్క సారక్క జాతర, నల్లమల పులులు, మహబూబ్‌నగర్ జిల్లాకే ప్రత్యేకమైన ఎద్దులు, తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన పీవీ నరసింహారావు వంటి ప్రముఖులు, కళాకారులు, క్రీడాకారులు, అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కదానికి బ్రాండింగ్‌లో చోటు కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికలను బ్రాండింగ్‌కు సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. ఈ నెల 30 వరకు సీఎం సమీక్షా సమావేశాలు జరగనున్నాయి.

