Minister Vakiti Srihari: రాష్ట్రంలోని 26 వేల నీటి వనరుల్లో సుమారు 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) వెల్లడించారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్య శాఖను కీలక భాగంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. సిద్దిపేట(Siddipet) జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువులో శనివారం జరిగిన ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్(Mettu Sai kumar) పాల్గొన్నారు.
మత్స్యకారుల కుటుంబాలకు..
హుస్నాబాద్ నియోజకవర్గంలో మత్స్య సంపద మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రులు ప్రకటించారు. ఎల్లమ్మ చెరువులో రూ.5.17 లక్షలతో 3 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఒక్క ఎల్లమ్మ చెరువు వద్దే 253 మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు. నియోజకవర్గంలోని 165 చెరువుల్లో మొత్తం 38.92 లక్షల ఉచిత చేప పిల్లలు విడుదల చేయనుండగా, 4,144 మంది మత్స్యకారుల కుటుంబాలకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. మంత్రి పొన్నం విజ్ఞప్తి మేరకు, హుస్నాబాద్‌ను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసి, ఇక్కడికి వచ్చే పర్యాటకులు చేపలు కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తామని శ్రీహరి హామీ ఇచ్చారు. అసంపూర్తిగా ఉన్న మోడర్న్ చేపల మార్కెట్, వెటర్నరీ హాస్పిటల్ ఆధునికీకరణ, స్టోరేజ్ సెంటర్, పాల శీతలీకరణ కేంద్రం తదితర పనులను చేపడతామన్నారు.
బీమా భరోసా..
మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, మత్స్య శాఖకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏకంగా రూ.123 కోట్లు కేటాయించారని తెలిపారు. గతంలో చేప పిల్లల పంపిణీలో జరిగిన అవకతవకలకు తావులేకుండా, పారదర్శకత కోసం చెరువుల వద్ద చేప రకం, సైజు, సంఖ్య వివరాలతో సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు 3 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్స్ అందించింది. అంతేకాకుండా, ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కింద రూ.5 లక్షల బీమా కల్పిస్తూ భరోసా ఇస్తోందన్నారు. గుర్తింపు పొందిన మత్స్యకారులకు రూ.1.40 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యంగా, గురుకులాల్లో మటన్, చికెన్ మాదిరిగానే చేపలను మెనూలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీహరి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మత్స్య సహకార సంఘం నాయకులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Also Read: GHMC: రేపటి నుంచి కలెక్టరేట్ జీహెచ్ఎంసీలో ప్రజావాణి.. 25న కౌన్సిల్ సమావేశం!
