Telangana Police: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య బిగ్ ఫైట్ నడిచింది. ఈ క్రమంలో అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదస్పదమైంది. అయితే మంగళవారం జూబ్లీహిల్స్ పోలింగ్ ముగియడంతో తాజాగా దీనిపై తెలంగాణ పోలీసు సంఘం స్పందించింది. కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర పోలీసు సంఘం ప్రకటించింది. ‘కేటిఆర్ ఒక వార్తా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ డిజిపి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, అనుచితంగా, అనాగరికంగా ఉన్నాయి. మేము చట్టానికి, ప్రజలకు ప్రాధాన్యత ఇస్తాం. పోలీసు శాఖ నిష్పక్షపాతంగా పని చేస్తుంది. శాంతి భద్రతలు కాపాడడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. వారు ప్రస్తావించిన అన్ని సంఘటనల్లో పోలీసులు చట్ట ప్రకారం కేసులు రిజిస్టర్ చేశారు’ అని పేర్కొంది.
Also Read: Delhi Car Blast: భూటాన్ నుంచి రిటర్న్.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన మోదీ.. బాధితులకు పరామర్శ
తెలంగాణలో జరిగిన దోపిడీ, హత్య కేసుల్లో అత్యంత వేగంగా నిందితులను పట్టుకున్నట్లు పోలీసు సంఘం తెలిపింది. ‘పోలీసుల పనితీరులో ఆక్షేపించవలసింది ఏమీ లేదు. ఒకవేళ ప్రశ్నించవలసివచ్చినా సంస్కారయుతంగా, సభ్యతతో ప్రశ్నించాలని గుర్తు చేస్తున్నాం. రాజకీయ ప్రేరేపిత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని అభ్యంతరకర భాషలో రాష్ట్ర డిజిపిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. పత్రికా ముఖంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి’ అని పోలీసు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి డిమాండ్ చేశారు.
