Telangana Police (imagcredit:twitter)
తెలంగాణ

Telangana Police: దయనీయ స్థితిలో పోలీసులు.. పట్టించుకోని అధికారులు

Telangana Police: అందరూ గుండెలపై చేతులు వేసుకుని గాఢ నిద్రపోతున్న వేళ వాళ్లు మాత్రం డ్యూటీల్లో ఉంటారు. పండుగలు వస్తే మిగితావారు భార్యాపిల్లలతో సంతోషంగా సమయం గడుపుతుంటే వాళ్లు విధులు నిర్వర్తిస్తూనే ఉంటారు. అందరు ప్రభుత్వ ఉద్యోగుల్లా వారి డ్యూటీలకు ఓ టైమంటూ ఉండదు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే స్టాండ్​ బై డ్యూటీల పేర రోజుల తరబడి ఫీల్డ్ లోనే ఉంటారు. టైంకు భోజనం ఉండదు. కంటి నిండా నిద్ర ఉండదు. ఎవరు వాళ్లు అని అనుకుంటున్నారా? వాళ్లే మన పోలీసులు(Police). ఇన్ని కష్టనష్టాలకు ఓరుస్తూ తెలంగాణ పోలీస్‌(Telangana Police)ను దేశంలోనే నెంబర్​వన్​స్థానంలో నిలబెట్టారు. అయినా, ప్రభుత్వం ఉన్నతాధికారులు వారి సంక్షేమంపై శీతకన్ను వేస్తున్నారు. పోలీసు సిబ్బంది కోసం అమల్లోకి తెచ్చిన ఆరోగ్య భద్రతను అటకెక్కించారు. బిల్లులు పేరుకుపోతున్నాయి ఆరోగ్య భద్రత కింద వైద్య సహాయం అందించేది లేదని ఆయా హాస్పిటళ్లు(Hospital) తెగేసి చెప్పేశాయి. సొంత డబ్బు ఖర్చు చేసి వైద్యం చేయించుకుని ఆ తరువాత బిల్లుల రీఎంబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేసకుంటే అవి నెలల తరబడి పెండింగులోనే ఉండిపోతున్నాయి. దాంతో పోలీసన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.

సిబ్బంది భద్రత కోసం..

నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP)​ఉన్న సమయం నుంచే పోలీసు సిబ్బంది కోసం ఆరోగ్య భద్రత ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2014, జూన్​ 2న తెలంగాణ పబ్లిక్ సొసైటీస్​రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ భద్రతను ప్రారంభించారు. డీజీపీ(DGP) నేతృత్వంలోని మేనేజింగ్​కమిటీ ఈ పథకం అమలవుతున్న తీరును పర్యవేక్షిస్తుంటుంది. పోలీసు శాఖలో పని చేసే ప్రతీ ఉద్యోగి ఈ భద్రత పథకంలో సభ్యుడే. పోలీసువర్గాలు తెలిపిన ప్రకారం కానిస్టేబుల్​ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు ప్రతీ ఉద్యోగి జీతం నుంచి ఆరోగ్య భద్రత కింద 1,600 రూపాయలు మినహాయిస్తున్నారు. ఎస్ఐ ఆ పై స్థాయి అధికారుల జీతాల నుంచి 3,2‌‌0‌‌0 కట్ చేస్తున్నారు. ఇలా మినహాయించిన మొత్తాన్ని సదరు ఉద్యోగి పదవీ విరమణ పొందిన తరువాత 5శాతం వడ్డీతో కలిపి ఇస్తున్నారు. ఈ మధ్యలో ఉద్యోగికిగానీ, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైతే కార్పోరేట్ ఆస్పత్రు(Carporate Hosoital)ల్లో చేరే వెసులుబాటును కల్పించారు. దీని కోసం దాదాపు రెండు వందల ప్రైవేట్ ఆస్పత్రులతో అవగాహన కుదుర్చుకున్నారు.

మొదట్లో..

ప్రారంభంలో ఆరోగ్య భద్రత పోలీసు సిబ్బందికి భరోసా కల్పించింది. తమకుగానీ తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైనపుడు చేతిలో రూపాయి లేకున్నా పోలీసు సిబ్బంది తమకు నచ్చిన హాస్పిటల్‌కు వెళ్లి చికిత్సలు చేయించుకున్నారు. గుండె ఆపరేషన్లు(Heart Operation) మొదలుకుని లక్షల రూపాయలు అవసరమయ్యే వైద్య సహాయాన్ని పొందగలిగారు. అయితే, రాను రాను ఆరోగ్య భద్రతకు గ్రహణం పట్టింది. చికిత్సలు చేసినందుకుగాను ఆయా హాస్పిటళ్లకు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. ప్రస్తుతం ఇలా పేరుకుపోయిన మొత్తం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

Also Read: YS Jagan: మంత్రి లోకేష్‌పై వైఎస్ జగన్ అనుచిత వ్యాఖ్యలు!

ఆరునెలలుగా..

అంతకంతూ పెండింగ్ బిల్లులు పెరిగి పోతుండటంతో తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(Telangana Speciality Hospital ఇకపై ఆరోగ్య భద్రత కింద ఇకపై పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి చికిత్సలు అందించేది లేదని ఆరునెలల క్రితమే చెప్పేశాయి. పెండింగ్ బిల్లులు ఎలా చెల్లిస్తారన్న దానిపై ఓ స్పష్టమైన విధానాన్ని ప్రకటించటంతోపాటు ఇప్పటికే బకాయి పడ్డ డబ్బులో కొంతమేర చెల్లించాలని డిమాండ్​ చేశాయి. అయితే, దీనిపై ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా స్పందన రాకపోవటంతో ఆయా హాస్పిటళ్లు ఆరు నెలలుగా ఆరోగ్య భద్రత సేవలను నిలిపి వేశాయి. డబ్బు కడితేనే ట్రీట్మెంట్ అంటూ పోలీసు సిబ్బందికి తెగేసి చెబుతున్నాయి. ఈ పరిణామం కొన్ని విషాదాలకు దారి తీస్తోంది.

దీనికి నిదర్శనంగా కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించిన ఆర్మ్‌డ్ రిజర్వ్​డ్ ఎస్​ఐ జనార్దన్ రావు(Janardhan Rao) విషాదాంతాన్ని పేర్కొనవచ్చు. బేగంపేట ప్రాంతంలో నివాసముంటున్న ఆయనకు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది మొదట అతన్ని సోమాజీగూడలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మేజర్ ఆపరేషన్​జరపాలి కాబట్టి అడ్వాన్సుగా కొంత డబ్బు కట్టాలని హాస్పిటల్ వర్గాలు సూచించాయి. ఆరోగ్య భద్రత కార్డు ఉందని చెప్పగా వైద్యం అందించలేమని ఖరాఖండిగా చెప్పేశాయి. దాంతో జనార్ధన్ రావును మరో రెండు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో జరిగిన కాలయాపనతో సమయం మించిపోయి జనార్ధన్ రావు కన్నుమూశారు.

రీ ఎంబర్స్ మెంట్ కూడా ఇవ్వటం లేదు

ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది పోలీసు సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులకు వైద్యం చేయిస్తున్నారు. ఆ తరువాత ఆస్పత్రి బిల్లులను సమర్పిస్తూ రీ ఎంబర్స్​ మెంట్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే, నెలలు గడిచిపోతున్నాయి తప్పితే ఈ దరఖాస్తులు పరిష్కారానికి మాత్రం నోచుకోవటం లేదు. ఈ పరిస్థితులపై పోలీసు సిబ్బంది తీవ్ర ఆవేదన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడటం కోసం రాత్రింబవళ్లు పని చేసే తమ గురించి పట్టించుకోరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య భద్రత కింద ప్రతీనెలా తమ జీతాల్లో నుంచి మినహాయిస్తున్న డబ్బు ఏమవుతోంది? అని ప్రశ్నిస్తున్నారు. మా ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని డిమాండ్​చేస్తున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం పోలీసన్నల ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

Also Read: Viral News: కోడలి హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. అర్ధరాత్రి గదిలోకి మామ

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?