Fog Driving Tips: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకుగానూ ఇటీవలే ‘అరైవ్..అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పోలీస్ శాఖ, తాజాగా చలికాలంలో యాక్సిడెంట్లను నివారించే చర్యలకు శ్రీకారం చుట్టింది. పొగమంచు ఎక్కువగా ఉండే సాయంత్రం, తెల్లవారుజాము సమయాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పలు కీలక సూచనలు చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశంతో పాటు యాక్సిడెంట్లు జరిగే ముప్పు ఉంటుందని, అందుకే, గమ్యస్థానానికి చేరుకోవాల్సిన సమయాన్ని అంచనా వేసుకుని వీలైనంత త్వరగా బయల్దేరాలని పోలీస్ శాఖ సూచించింది. ఇక, మంచు కారణంగా రోడ్డు(Roads) స్పష్టంగా కనిపించదని, ముందు వెళుతున్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనా వేయటం కూడా కష్టమని, కాబట్టి అతివేగం, ఓవర్ టేక్ వంటివి చేయవద్దని సూచించింది. సురక్షితమని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే ఓవర్‌టేకింగ్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఇక, హై బీమ్లైట్లను ఉపయోగించవద్దని పేర్కొన్నారు. హైబీమ్ లైట్ల వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులతో పాటు డ్రైవింగ్చేసేవారికి కూడా రోడ్డు సరిగ్గా కనిపించదని చెప్పారు. లో బీమ్, ఫాగ్లైట్లను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు. ముందు వెళుతున్న వాహనానికి, వెనుకాల వెళ్తున్న వాహనానికి మధ్య సురక్షిత దూరం ఉండేట్టు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.
Also Read: Aadhaar: మీ బిడ్డకు ఆధార్ అప్లై చేయాలా.. ఈ సింపుల్ ఆన్‌లైన్ స్టెప్-బై-స్టెప్ ఫాలో అవ్వండి!
జిగ్‌జాగ్ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు
నిర్ధేశించిన లైన్లలోనే వాహనాలను నడపాలని అధికారులు పేర్కొన్నారు. జిగ్‌జాగ్ డ్రైవింగ్(Zigzag driving) చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇక, వాహనాల కిటికీలను కొద్దిగా తెరిచి ఉంచాలని చెప్పారు. అలా చేస్తే పొగ మంచు ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా విచ్ఛిన్నమవుతుందని చెప్పారు. తద్వారా డ్రైవర్ విజిబిలిటీ మెరుగవుతుందన్నారు. పొగమంచు ఎక్కువగా ఉంటే సురక్షిత ప్రదేశంలో వాహనాలను ఆపాలన్నారు. మంచు తగ్గాక తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించాలని పేర్కొన్నారు. అద్దాలను శుభ్రంగా పెట్టుకోవాలన్నారు. ఇక, డ్రైవింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా ఇండికేటర్లను ఉపయోగించాలని సూచించారు. ఎటువైపు టర్న్ తీసుకుంటున్నారు?, ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్నారా? అన్నది వెనక వచ్చేవారికి తెలిసేలా ఇండికేటర్లతో తెలియచేయాలని చెప్పారు. చలికాలంలో రోడ్లు తడిగా ఉండి వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సడన్ బ్రేక్ వేయటాన్ని తగ్గించాలని వాహనదారులకు పోలీసు శాఖ అధికారులు సూచించారు. ప్రతీ ఒక్కరూ ఈ సూచనలను పాటించి యాక్సిడెంట్ల నివారణకు సహకరించి తమ ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Raju Weds Rambai: రెండో రోజు రాజు, రాంబాయి ఊచకోత.. హుజూరాబాద్‌లో టీమ్ హంగామా

