Andesri Passed Away: తెలంగాణ కవి, ప్రముఖ రచయిత అందెశ్రీ (64) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని నివాసంలో ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు.. హుటాహుటీనా గాంధీ అస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేర్చిన 5 నిమిషాల వ్యవధిలోనే ఉదయం 7.25 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. గుండెపోటుతో అందెశ్రీ మరణించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 3 రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల అందెశ్రీ అశ్రద్ధ వహించారని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో..
ప్రముఖ కవి అందెశ్రీ పార్థివ దేహాన్ని లాలాపేటలోని నివాసానికి కుటుంబ సభ్యులు తరలించారు. మధ్యాహ్నం వరకూ అక్కడే ఉంచి ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్డేడియానికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు అందెశ్రీని ఆఖరి చూపు చూసుకునేందుకు లాలాపేటలోని నివాసానికి పెద్ద ఎత్తున ప్రముఖులు తరలివస్తున్నారు. ఇదిలా ఉంటే అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబ సభ్యులతో సంప్రదించి సమయం, స్థలం నిర్ణయించాలని సీఎస్ రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. మరోవైపు అందెశ్రీ సందర్శనార్థం పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తెలత్తకుండా చూసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇదిలా ఉంటే రేపు ఘట్ కేసర్ లో అందెశ్రీ అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల సీఎంలు.. సంతాపం
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీ మరణం.. తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. అందెశ్రీ అందించిన జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా అందెశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని రేవంత్ తెలియజేశారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు సైతం అందెశ్రీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలియజేశారు.
కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని సంతాపం వ్యక్తం
అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి https://t.co/RQGFLh4mua pic.twitter.com/vXUaV8jJik
— BIG TV Breaking News (@bigtvtelugu) November 10, 2025
కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అందెశ్రీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో ఆయన కీలక భూమిక పోషించినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా అందెశ్రీ మరణం పట్ల సంతాపం తెలియజేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వారి పాటలు ప్రజల మదిలో ఎన్నటికీ నిలిచి ఉంటాయని అన్నారు. ‘జయ జయహే తెలంగాణ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది’ అంటూ కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Also Read: Bigg Boss Telugu 9 : నామినేషన్లలో రచ్చ రచ్చ.. సహనం కోల్పోయిన రీతూ.. హౌస్ మేట్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు
పవన్, లోకేశ్ నివాళులు..
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన అందెశ్రీ హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనా ప్రస్థానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుందని గుర్తుచేశారు. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితాన్ని మెుదలు పెట్టిన ఆయన. తెలంగాణ జానపదాలపై పట్టు సాధించారన్నారు. అందెశ్రీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అందెశ్రీ మరణంపై ఏపీ మంత్రి నారా లోకశ్ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” అనే పాటతోపాటు ఎన్నో ఉద్యమ గీతాలు రాసిన ప్రజాకవికి హృదయపూర్వక శ్రద్ధాంజలి. సాహిత్యానికి అందెశ్రీ గారు అందించిన సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని లోకేశ్ పోస్ట్ చేశారు.
