PCC Mahesh Kumar Goud: పదేళ్ల తర్వాత పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని.. పదేళ్ల పాటు అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నా. గత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సలహాలు, సూచనల ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని 2023 లో పవర్ లోకి తీసుకువచ్చేందుకు కష్టపడ్డాం. కేసీఆర్(KCR) ను గద్దె దించేందుకు ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేసినం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే బంధంతో ఇద్దరం వర్క్ చేస్తున్నాం. సీఎం రేవంత్, నాకు కెమెస్ట్రీ కుదిరింది. ఇద్దరి అభిప్రాయాలు ఏకీకృతమవుతున్నాయి. అధికారంలోకి వచ్చాక పార్టీ, ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు నడుపుతున్నాం.రాబోయే రోజుల్లోనూ పార్టీ, ప్రభుత్వం రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) వెల్లడించారు. పీసీసీ చీఫ్ గా ఆయన ఉత్తర్వులు అందుకొని ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పాటు ఆయన చేసిన కార్యక్రమాలు, పార్టీ డెవలప్ కు తీసుకున్న కీలక నిర్ణయాలు, కార్యకర్తలకు చేసిన న్యాయం వంటి తదితర అంశాలను ఆయన స్వేచ్ఛతో మాట్లాడారు. ఆ ముచ్చట్లన్నీ ఆయన మాటల్లోనే…
స్వేచ్ఛ :పీసీసీ బాధ్యతలు సంతృప్తిని ఇచ్చాయా?
పీసీసీ చీఫ్: కాంగ్రెస్ పార్టీలో ఎన్ ఎస్ యూఐ నుంచి పీసీసీ చీఫ్ వరకు ఎదిగాను. సుమారు 30 ఏళ్లకు పైగా పార్టీలో అన్ని బాధ్యతల్లోనూ పనిచేశాను. పార్టీ ఇచ్చిన టాస్క్ ను సమర్ధవంతంగా పూర్తి చేయడమే నా లక్ష్యం. చాలా మంది పీసీసీ చీఫ్ ల కింద పనిచేయడం గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఒక్కొక్కరి నుంచి ఒక్కో అంశాన్నీ స్పష్టంగా నేర్చుకున్నా. ఇప్పుడు అమలు చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చే ముందు వ రకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్లో పనిచేశా. అధికారంలోకి వచ్చాక పీసీసీ చీఫ్ హోదాలో పనిచేస్తున్నా. కోట్ల మంది కార్యకర్తలకు రాని అవకాశం నాకు వచ్చింది. పీసీసీ చీఫ్ గా సంతృప్తిగా పనిచేస్తున్నాను. అంతే గాక బాధ్యతలు కూడా పెంచింది.
స్వేచ్ఛ: పార్టీ కోసం పనిచేసిన వాళ్లలో ఇంకా కొంత మంది అసంతృప్తితో ఉన్నారు? వాళ్లకేం చెప్తారు..?
పీసీసీ చీఫ్: కాంగ్రెస్ పవర్ లోకి రాగానే గాంధీభవన్ లో పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసినోళ్లకే ప్రభుత్వంలోనూ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినం. 2025 మే నెలలో తెలంగాణ పీసీసీకి నూతన కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పోస్టుల్లో బడగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకా ఇస్తూనే ఉంటాం. పార్టీ కోసం ఎవరు ఎక్కడ ఉపయోగపడతారనే అంశాన్ని హైకమాండ్ క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసి పదవులు కేటాయిస్తుంది. ప్రభుత్వ పోస్టుల భర్తీలోనూ ఇదే విధానంలో ప్రాసెస్ జరుగుతుంది. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్(Congress) పార్టీలో సామాజిక న్యాయంతో పదవులు,పోస్టులు ఇస్తున్నాం. పది రోజుల్లోనే అన్ని కమిటీలు వేస్తున్నాం. వచ్చే నెలలో కార్పొరేషన్ పదవులు కేటాయిస్తాం. లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తాం. డీసీసీ ల ప్రాసెస్ కాస్త లేట్ అవుతుంది. పదేళ్ల పార్టీ పవర్ లో అందరిని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తాం.
Also Read: Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?
స్వేచ్ఛ: నేతల మధ్య సమన్వయంలో ఫెయిలయ్యారనే విమర్శలపై స్పందన..?
పీసీసీ చీఫ్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సమిష్టి కృషితోనే అనేది గుర్తు పెట్టుకోవాలి. ఎన్నికల కంటే ముందు చాలా మంది సీనియర్లను, కొత్తగా పార్టీలో చేరే వాళ్లను నేను, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, అప్పటికీ ఏఐసీసీ ఇన్ చార్జీ మానిక్ రాజ్ థాక్రే(AICC in-charge Manik Raj Thackeray) ప్రత్యేకంగా సమన్వయం చేయాల్సి వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాలా మంది సీనియర్లను నేను బుజ్జగించాను. ఇదే సమయంలో ఆయా నేతల నుంచి నాకు విమర్శలు ఎదురయ్యాయి. ఎక్కడా సహనం కోల్పోలేదు. ప్రభుత్వం తప్పక వస్తుందని నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఆయా లీడర్లలో కొందరు మంత్రులు, పార్టీలో కీ పోస్టుల్లోనూ ఇప్పుడు పనిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన లీడర్లు, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ చార్జీల మధ్య స్వల్ప గ్యాప్ ఉన్నదనేది మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఆ గ్యాప్ ను తొలగించాం. త్వరలోనే నేతలందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. గడిచిన ఏడాది కాలంగా సీఎం, మంత్రులు పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు నాకు ఎంతో సహకరిస్తున్నారు. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ. అందుకే నేతలంతా ఓపెన్ గా మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి వివాదాలుగా మారుతున్నాయి. క్రమ శిక్షణ కమిటీ వాటి పరిస్థితిని పరిశీలించి తదుపరి ఆదేశాలిస్తుంది. కొండా మురళీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాలను చైర్మన్ మల్లు రవి పరిశీలిస్తున్నారు.
స్వేచ్ఛ: ఏడాదిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలు ఏమిటీ? వాటితో వచ్చిన మైలేజ్ ఏమీ..?
పీసీసీ చీఫ్ : రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏఐసీసీ(AICC) పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘జై బాపు, జై బీమ్, జై సంవిధాన్’ కార్యక్రమాలను టీపీసీసీ నేతృత్వంలో పెద్ద ఎత్తున చేపట్టాం. రాజ్యంగ పరిరక్షణతో పాటు మహాత్మా గాంధీ(Gandhi), నెహ్రూ(Nehru), అంబేద్కర్(Ambedkar) చరిత్రను వక్రీకరిస్తూ అవమనా పరుస్తున్న బీజేపీ పన్నాగాలను తిప్పికొడుతూ తెలంగాణ(Telangana)లో టీపీసీసీ పలు కార్యక్రమాలను సంపూర్ణంగా అమలు చేసింది. ఓట్ చోరీపై భారీ స్థాయిలో నిరసనలు చేపట్టినాం. ఇది బీజేపీ(BJP) గ్రాప్ ను తగ్గించేందుకు ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడింది. ఇక కార్యకర్తల సమస్యలు, కష్టాలను గుర్తించేందుకు గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖీ, ప్రజాప్రతినిధుల ప్రోగ్రామ్ ను కంటిన్యూగా నిర్వహిస్తున్నాం. ఇవి సక్సెస్ పుల్ గా కొనసాగుతున్నాయి.ప్రభుత్వ పథకాలపై పబ్లిసిటీ, పార్టీ ప్రోగ్రామ్ లను సక్సెస్ చేసేందుకు నేతల్లో చైతన్యం కల్పించేందుకు జనహిత పాదయాత్రను రెండు దశల్లో వివిధ జిల్లాల్లో పూర్తి చేశాం. రాబోయే రోజుల్లోనూ మిగతా జిల్లాల్లో నిర్వహిస్తాం.
స్వేచ్ఛ: బీసీ ముఖ్యమంత్రి అభ్యర్ధి మీరేనా..? బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారా?
పీసీసీ చీఫ్: భవిష్యత్ లో బీసీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అవుతారు. కానీ ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఐదేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పనిచేస్తారు. ఆయన నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకూ వెళ్తాం. బీసీ(BC) రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సిన ప్రాసెస్ అంతా పూర్తిచేశాం. రిజర్వేషన్ల సవరణకు ఆర్డినెన్స్, బిల్లులకు తీర్మానం చేసి గవర్నర్ రాష్ట్రపతికి పంపించాం. వాళ్ల నుంచి క్లియరెన్స్ లేదు. కేంద్రం పరోక్షంగా తొక్కిపడుతుందనే విషయం తెలుసు. కానీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం. లీగల్ అభిప్రాయాలను తీసుకున్నాం. తప్పకుండా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఈ నెల 15 కామారెడ్డిలో సభ నిర్వహించి రిజర్వేషన్లపై జరిగిన విషయాన్ని బహిరంగంగానే ప్రజలకు చెప్తాం.
Also Read: Huzurabad Civil Hospital: పెండింగ్ జీతాల కోసం.. సివిల్ హాస్పిటల్ వర్కర్స్ సమ్మె!
స్వేచ్ఛ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందంటే ఏం చెప్తారు..?
పీసీసీ చీఫ్: రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఇందిరమ్మ భరోసా, వరికి బోనస్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది.మహిళా సాధికారిత కోసం ఉచిత బస్సు ప్రయాణంతో పాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ఇందిరా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రూ.10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయి. ఇక యువతకు 65 వేలకు పైగా ప్రభుత్వ నియామకాలు కల్పించడంతో పాటు వారు వ్యాపారం చేసుకునేలా రాజీవ్ యువ వికాసం ద్వారా ప్రభుత్వం రుణాలు అందిస్తున్నది. ప్రభుత్వ హాస్టల్స్‌లో, గురుకులాల్లో వసతి సౌకర్యాలు, డైట్ చార్జీలు పెంచినం. ఇవే కాకుండా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయగా, బీసీ రిజర్వేషన్ ప్రాసెస్ చివరి దశలో ఉన్నది.
స్వేచ్ఛ: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని జైల్లో వేయాలని డిమాండ్ చేశారు..? మీ ప్రభుత్వం పంపిస్తుందా?
పీసీసీ చీఫ్: తప్పు చేసిన బీఆర్ ఎస్ నాయకులకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేసింది వాస్తవమే. ఎన్నికల కంటే ముందు బీఆర్ ఎస్ తప్పిదాలను డిక్లరేషన్ల పేరిట ప్రజల్లోకి తీసుకువెళ్లినం. ప్రస్తుతం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, నిర్లక్ష్యాలన్నీ విచారణ దశల్లోనే ఉన్నాయి. కాళేశ్వరం తప్పిదాలు, నిర్లక్ష్యం పై కమిషన్ కూడా రిపోర్టు ఇచ్చింది. దాని ఆధారంగా సీబీఐకు లేఖ రాసినం. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత చట్ట పరంగా శిక్షలు తప్పకుండా పడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరినీ ఊపేక్షించబోం. ప్రజల ఆస్తి, సొమ్మును రక్షించడమే మా కార్తవ్యం.
స్వేచ్ఛ: కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇస్తారు?
పీసీసీ చీఫ్: పదేళ్లు కేసీఆర్ రాక్షస పాలన నుంచి పార్టీని కాపాడారు. ఎన్నో కేసులు, విమర్శలు, వివాదాలను కార్యకర్తలు ఎదుర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పవర్ లోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కష్టబడ్డారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను భూ స్థాపితం చేసేందుకు ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా అడ్డుకున్నారు. లీడర్లను అగ్రస్థానంలో కుర్చోపెట్టారు. ఇప్పుడు లీడర్లంతా కలిసి కార్యకర్తలను గెలిపించాల్సిన సమయం వచ్చింది. స్థానిక సంస్థల్లో బీఆర్ ఎస్ ఉనికి లేకుండా చేసి , తమ కార్యకర్తలను క్షేత్రస్థాయిలో విజయం సాధించేలా కృషి చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి, నేను కలిసి ఈ బాధ్యతలు తీసుకున్నాం.
Also Read: Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?