Tummala NageswaraRao: తెలంగాణకు కేటాయించిన ఎరువులను సకాలంలో రాష్ట్రానికి తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన విధంగా సరఫరాకు అనుగుణంగా జిల్లా వారీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. దిగుమతి యూరియాలో తెలంగాణకు కేటాయించిన సరఫరా జరగకపోవడంతో, దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియాను కేటాయించాలని కేంద్రాన్ని కోరామన్నారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి కేటాయింపులను 30 వేల టన్నుల నుండి 60 వేల టన్నులకు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని తుమ్మల తెలిపారు. చాలా పంటలు ఆరంభ దశలో ఉన్నందున, రైతులు ప్రస్తుతం యూరియా అవసరం ఉన్నా లేకపోయినా కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో కేంద్రం నుంచి ఆగస్టు నెలకు కూడా సరిపడా ఎరువులు త్వరలోనే రాష్ట్రానికి అందుతాయని ఆశిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Also Read: Asia Oldest Elephant: ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం!
అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవు?
జిల్లాల వారీగా సాగు విస్తీర్ణాలు, కేంద్రం నుంచి సరఫరా అవుతున్న పరిమాణాలను బట్టి జిల్లాల వారీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఏ మండలంలోనూ యూరియా కొరత లేకుండా, ఆయా మండల కేంద్రాల్లో ఎరువులను సిద్ధంగా ఉంచే బాధ్యత జిల్లా అధికారులపై ఉంటుందని స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఏ డీలరైనా, సొసైటీ నిర్వాహకులతో సహా యూరియా బస్తాను అధిక ధరకు విక్రయించినా, యూరియా బస్తాలకు ఇతర ప్రొడక్టులను లింక్ పెట్టి అమ్మజూసినా, లేక ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ప్రతి జిల్లా కలెక్టర్‌కు రోజువారీ ఎరువుల నిల్వలను పంపించే ఏర్పాటు చేసినందున, వారు సంబంధిత అధికారులతో నిత్యం సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన ఆదేశించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి జూలై వరకు కేటాయించిన 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరే వరకు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో నిత్యం సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
Also Read: Soothravakyam: వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో పోలీస్‌గా నటించిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?