Indiramma Housing Scheme: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని, ఉచిత ఇసుక కూపన్ల పంపిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామంలో ఆయన మంత్రి సీతక్కతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ములుగు నియోజకవర్గానికి 3,500 ఇండ్లతో పాటు ఐటీడీఏ పరిధి దృష్ట్యా మరో 1500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. అయితే మంత్రి సీతక్క అభ్యర్థన మేరకు మరో 1000 ఇందిరమ్మ ఇండ్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.
10-15 రోజుల్లో ఇండ్ల నిర్మాణం
లబ్ధిదారులు మరో 10-15 రోజుల్లో ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తే ప్రతి సోమవారం వారికి నిధులు రిలీజ్ చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలోని అటవీ భూముల్లో ఇంతవరకు చిన్నపాటి ఇంటిని కలిగి అందులో నివసిస్తున్న ప్రజలకు అక్కడే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం కల్పించాలంటూ అటవీ అధికారులను ఆదేశిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రంలో చెంచులకు ప్రత్యేకంగా 10 వేల ఇండ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంజూరు చేశామని చెప్పారు. గతంలో 9 ఏండ్ల పాలనలో పేదలకు 25.50 లక్షళ ఇండ్లు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ రెండు దఫాలు రాజ్యమేలినా కేవలం 92 వేల ఇండ్లకు ఆమోదం తెలిపి 60 వేల ఇండ్లను మాత్రమే పూర్తిచేసిందనన్నారు. 30 వేలకు పైగా ఇండ్లు మొండిగోడలతో మిగిలిపోయాయని మంత్రి ఎద్దేవా చేశారు.
Also Read: Hyderabad Real Estate: దేశంలో రియల్ ఎస్టేట్ పడిపోయినా.. హైదరాబాద్‌లో రేట్లు మాత్రం తగ్గేదేలే!
ఒక్కో గ్రామానికి 25 ఇండ్లు
కట్టిన ఇండ్లకు కాంట్రాక్టర్లకు కూడా డబ్బు చెల్లించలేదన్నారు. ప్రస్తుత ఇందిరమ్మ ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లిస్తూనే, గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6500 కోట్లు వడ్డీగా కడుతూనే ఇండ్ల నిర్మాణానికి పూనుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం కనీసం 60 మంది వరకు అర్హులైనవారు ఉన్నారని, ఇప్పుడు ఒక్కో గ్రామానికి 25 ఇండ్లు మాత్రమే ఇచ్చే వీలుందని మంత్రి పొంగులేటి తెలిపారు. భవిష్యత్తులో అన్ని గ్రామాల్లోని అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు తప్పక వస్తాయని మంత్రి భరోసా ఇచ్చారు.
20 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంకల్పం
రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంకల్పించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గమనించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి పొంగులేటి కోరారు. భూభారతికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో రైతులు అధికారుల చుట్టూ తిరిగినా వారి సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారని మంత్రి గుర్తుచేశారు.
Also Read: Ponguleti Srinivas Reddy: కాళేశ్వరంప్రాజెక్ట్.. ధరణి మిషన్ భగీరథ పథకాలు పెద్ద స్కాం!