Accreditation Guidelines: కొత్త జీవోతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి స్పందన
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపరచబోవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులకు సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ వర్తించడంతో పాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు యోచిస్తున్నారని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం అక్రెడిటేషన్ విషయంలో ఉర్దూ జర్నలిస్టుల పట్ల అనుసరించిన వివక్షతను, చిన్న పత్రికల పట్ల చూపిన చిన్న చూపును తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన అంశాలను ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాలను దృష్టిలో ఉంచుకొని, కొత్త జీఓలో మార్పు చేసినట్టు ఆయన వెల్లడించారు. నూతన జీవోపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసత్యాలను వక్రీకరిస్తూ సంక్షేమ చర్యలు విలేకరులకు మాత్రమే వర్తిస్తాయని చెబుతున్నారంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.
వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఇవి వర్తిస్తాయని కె.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాలపై అవసరమైతే వివరణ కొరవచ్చని ఆయన సూచించారు. జర్నలిస్టుల సంక్షేమ చర్యల పట్ల ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రితో ఎప్పుడైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఇందుకు విరుద్ధంగాఓ రాజకీయ ఎత్తుగడతో కొన్ని శక్తులు ఆందోళన చేయాలని తలపెట్టడం అత్యంత విచారకరమని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల పట్ల, వారి సమస్యల పట్ల రేవంత్ రెడ్డి నాయకత్వాన ఉన్న ప్రజా ప్రభుత్వం సానుకూల పరిష్కారానికి వెళ్తుంది తప్పా, గత ప్రభుత్వం మాదిరిగా వివక్షత చూపే అవకాశమే లేదని ఆయన తెలిపారు. నూతన జీవోపై పనిగట్టుకొని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని విశ్వసించరాదని వర్కింగ్ జర్నలిస్టులకు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Read Also- India Warns Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై మూకదాడుల పట్ల కేంద్రం కీలక వ్యాఖ్యలు

