Telangana Local Body Elections: స్థానిక సమరంపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. క్రికెట్, ఎన్నికలు, కోర్టు కేసులు ఏవైనా సరే.. వారికి ఒక అంశం దొరికితే చాలు బెట్టింగు రాయుళ్లు రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల (Telangana Local Body Elections 2025) నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో కోర్టు ఏం తీర్పు ఇస్తుంది? అసలు ఎన్నికలు జరుగుతాయా? జరుగవా? రిజర్వేషన్లు ఇలానే ఉంటాయా? మారుతాయా? ఎన్నికలు జరిగినా ఫలితాలు వెలువడుతాయా? ఫలితాలు వచ్చినా పదవులు ఉంటాయా? కోర్టు ఏం తీర్పు ఇస్తుంది?.. ఇలా అనేక రకాల అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. గ్రామాల్లో ఎన్నికల సందడి లేకుండా పోయి, నిత్యం ఇదే చర్చ సాగుతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠలో ఆశావాహులు ఉండగా.. మరోవైపు ఇదే అదునుగా ఈ ఎన్నికలను వేదికగా చేసుకుని బెట్టింగు రాయుళ్ళు గ్రామాల్లో జోరుగా బెట్టింగులకు తెగబడుతున్నారు. ఊరు, వాడ నుంచి మండల, జిల్లా, కేంద్రాల వరకు ఈ బెట్టింగుల జోరు సాగుతుంది.
పందెం రాయుళ్ళ జోరు
రాష్ట్రమంతా కోర్టు తీర్పు రిజర్వేషన్లు ఎన్నికల నిర్వహణపై చర్చ సాగిస్తుంటే.. ఎన్నికలు జరుగుతాయని ఒక వర్గం పందెం కాస్తే.. కాదు కాదు, అస్సలు ఎన్నికలు జరుగవు అని మరొక వర్గం పందెం కాస్తుంది. బీసీ రిజర్వేషన్లపై విచారణను హైకోర్టు అక్టోబర్ 8 వరకు వాయిదా వేయడంతో ఇప్పుడు హైకోర్టు ఎన్నికలు అడ్డుకుంటుందని ఒక వర్గం వాదిస్తే.. అంతకు ముందే ఎన్నికల కమీషనర్ ఎన్నికల నోటిఫికేషన్ వేస్తారని, ఎన్నికలు యధావిథిగా జరుగుతాయని మరొక వర్గం వాదిస్తుంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా బెట్టింగు రాయుళ్ళు మాత్రం తమ బెట్టింగులను సాగిస్తూనే ఉన్నారు.
Also Read- 80s Reunion Party: ‘80స్ రీ-యూనియన్ పార్టీ’కి ఒకే ఫ్లైట్‌లో చిరు, వెంకీ.. ఫొటో వైరల్!
రిజర్వేషన్లు మారుతాయా?
బెట్టింగు రాయుళ్ళు ఫోన్లలోనే బెట్టింగులు కట్టేస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ కొందరు గ్రూపులుగా ఏర్పడి రహాస్యంగా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. బీరు నుంచి మొదలు పెడితే.. వేల రూపాయలు ఈ బెట్టింగుల్లో బెట్టింగులు పెట్టేందుకు ఔత్సాహికులు పాల్గొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 వరకు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమీషన్‌లు ఎన్నికల నిర్వహణపై ఎవ్వరి పని వారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలు నిర్వహించకుంటే సుప్రింకోర్టు నిర్ణయాన్ని దిక్కరించినట్లు అవుతుందనే ఆలోచనతో హడావుడిగా ఎన్నికల ప్రక్రియను షురూ చేసిందని కొందరు వాదిస్తున్నారు. కోర్టు ధిక్కరణ ఎదుర్కొనే కంటే ఎన్నికల సన్నాహాలు మొదలు పెడితే బాగుంటుందనే సర్కారు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకుపోతుందనే అపవాదు లేకపోలేదు. ఈ తరుణంలో సెప్టెంబర్ 27న స్థానిక రిజర్వేషన్ల ప్రక్రియను ముగించింది. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసి నోటీఫికేషన్‌కు మాత్రం అక్టోబర్ 9న అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక స్థానిక సంస్థల రిజర్వేషన్లను కలెక్టర్లు, ఆర్డీఓల స్థాయిలో ప్రకటించారు. అయితే బీసి రిజర్వేషన్లు ప్రకటించడం, స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించడంతో ఓసీలకు తీరని అన్యాయం జరిగిందనే ప్రచారం సాగుతుంది. దీంతో మాధవరెడ్డి అనే వ్యక్తి బీసీ రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కేసును అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఇప్పుడు హైకోర్టు ఏమీ తీర్పు ఇస్తుందో అనే మీమాంసలో రాజకీయ నాయకులు, ప్రజలు ఉన్నారు. హైకోర్టు బీసీ రిజర్వేషన్లు చెల్లదని తీర్పు ఇస్తుందని కొందరు, రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని మరికొందరు ఈ బెట్టింగులు కడుతున్నారు. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినా.. గవర్నర్ ఇంకా దానిని ఆమోదించలేదని, రాష్ట్రపతి ఆమోదించాలని.. అప్పుడే ఇవి అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాల్లో సర్వత్ర చర్చ సాగుతుంది. అందుకే ఈ బిల్లుకు మోక్షం లభించదని, రిజర్వేషన్లు మారుతాయని పందాలు కడుతున్నారు. ఏదేమైనా పందెం రాయుళ్ళకు మాత్రం స్థానిక ఎన్నికలు భలే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
