Aarogyasri Link Drive: రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ లింక్ డ్రైవ్‌ను నిర్వహించేందుకు హెల్త్ డిపార్ట్ మెంట్ సిద్ధమైంది. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో కొత్తగా మరో 30 లక్షల మందిని ఆరోగ్య శ్రీ(Aarogyasri )లో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త రేషన్ కార్డులతో పెరుగుతున్న లబ్ధిదారులను ఎప్పటికప్పుడు ఆరోగ్య శ్రీలో లింక్ చేయాలని వైద్యారోగ్యశాఖ భావిస్తున్నది. ఈ మేరకు ఆరోగ్య శ్రీ(Aarogyasri ) ట్రస్ట్ ఆఫీస్‌లో ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. వైద్యారోగ్యశాఖ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ ప్రాసెస్ నిర్వహించనున్నారు.
Also Read: Hari Hara Veera Mallu: అక్కడి తెలుగువారి కోసం ‘హరి హర వీరమల్లు’ స్పెషల్ షో
కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య లింక్‌లపై ఇప్పటికే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆరోగ్య శ్రీ(Aarogyasri) ట్రస్ట్ బోర్డు ఆఫీసర్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. వేగంగా లింక్ వ్యవస్థను పూర్తి చేయాలని కోరారు. పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రాసెస్ ఈజీగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీతో ప్రభుత్వానికి మరింత మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రేషన్ కార్డుల పంపిణీ, ఆరోగ్య శ్రీ అనుసంధాన ప్రాసెస్‌లు వేగంగా పూర్తి చేయాలని ఇటీవల సీఎం కూడా అధికారులను ఆదేశించారు. ఈనెల 28న జరగబోయే కేబినెట్‌లోనూ ఆరోగ్య శ్రీ(Aarogyasri ) లింక్ డ్రైవ్ పై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సచివాలయంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
రెండింటికీ పథకాలకు, సమన్వయం?
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 90.10 లక్షల కుటుంబాలు ఆరోగ్య శ్రీ(Aarogyasri ) పరిధిలోకి వస్తుండగా, 2.84 కోట్ల మంది అర్హులుగా ఉన్నారు. ఇప్పుడు కొత్త లబ్ధిదారులతో 93,99,361 కుటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి రానున్నాయి. ఆయా కార్డుల ద్వారా ఏకంగా లబ్ధిదారుల సంఖ్య 3,14,29,309 మందికి పెరగనున్నది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కూడా తెలంగాణలో అమలవుతున్నది. గతంలోనే ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లను మెర్జ్ చేశారు. దీని వలన చికిత్స ప్రోసీజర్లు పెరిగాయి. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ కలిపి అమలు చేయడం వలన సుమారు 1835 ప్రోసీజర్లు చికిత్స లభిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. డెంగీ, స్వైన్ ప్లూ తదితర వైరల్ ఫీవర్లకూ ఈ కార్డులు వర్తిస్తాయని అధికారులు వివరించారు.
ఆసుపత్రులకు ఆదేశాలు!
ఇక ఆరోగ్య శ్రీ ఎంప్యానల్ చేసుకున్న ఆసుపత్రులన్నీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను కూడా అమలు చేయాల్సిందే. కేంద్ర, రాష్ట్ర పథకాలను కలపడం వలనే పేషెంట్లకు సరిపోయే ప్రోసీజర్‌ను ఎంపిక చేసుకొని ట్రీట్మెంట్ అందించడం డాక్టర్లకూ సులువుగా మారింది. గతంలో వేర్వేరుగా స్కీమ్‌లు ఉండటం వలన చాలా ప్రోసీజర్లు ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాలేదు. దీంతో రోగులంతా సొంత డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కొందరు ఉస్మానియా, గాంధీకి వెళ్లవలసి వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం, ప్రైవేట్ కలిపి దాదాపు రూ.1400 నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్నాయి. దీంతో కొత్త రేషన్ కార్డులు అప్రూవల్ అయినోళ్లందరికీ ఆటోమెటిక్‌గా ఆరోగ్య శ్రీ కార్డులు లింక్ చేస్తూనే, నెట్ వర్క్ ఆసుపత్రులకూ ఆదేశాలు ఇవ్వనున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ సమన్వయం చేసేందుకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ బోర్డు నుంచి కమ్యూనికేషన్స్ జరుగుతున్నాయి.
Also Read: Mirai Movie: ‘మిరాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. వైబ్ అదిరింది