Plastic Waste: రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ రహిత గ్రామాలపై దృష్టి సారించింది. తొలిసారిగా గ్రామాల్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 90 యూనిట్లు మంజూరు చేసిన ప్రభుత్వం దీనికోసం నిధులను కూడా కేటాయించింది. ఒక్కో యూనిట్‌కు రూ.64 లక్షలు మంజూరు చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద ఈ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ యూనిట్ల నిర్మాణానికి కలెక్టర్లు అనుమతులు ఇవ్వనున్నారు. మండలాలకు కేంద్రంగా ఈ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని డీఆర్డీవోలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతిరోజూ కనీసం 700 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ యూనిట్‌కు చేరవేయాలనే నిబంధన పెట్టింది. ఆయా మండలాల క్లస్టర్‌లోని పంచాయతీల్లో రోజూ ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణాన్ని అంచనా వేయాలి, దాని ఆధారంగా యూనిట్ల స్థాపనకు సరైన ప్రదేశాలను గుర్తించాలని అధికారులకు సూచించింది.
మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న భవనాలను ఈ యూనిట్ల కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీని ద్వారా కొంత వ్యయం తగ్గుతుందని భావిస్తున్నది. భవనం మొత్తం 2000 చదరపు గజాల కంటే తక్కువ ఉండకూడదని, ఎక్కడైనా తక్కువగా ఉంటే డీపీఆర్‌లో సూచించిన విధంగా నిర్మించుకోవచ్చని, రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్ కనెక్షన్లు, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతంలోనే యూనిట్ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యూనిట్ కోసం అవసరమైన అనుమతులు పొందిన తర్వాత పని మూడు దశల్లో గ్రౌండింగ్ చేసి జియో ట్యాగ్ చేయాలని ఆదేశించింది. ప్రతి యూనిట్‌పై ఎస్‌బీఎం లోగో, ట్యాగ్‌లైన్ పెయింట్‌తో వేయనున్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.516 కోట్లు
బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్ ప్లస్) పల్లెలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఇందు కోసం స్వచ్ఛ భారత్ మిషన్ – గ్రామీణ్‌కు రూ.516.40 కోట్లు మంజూరు చేసింది. ఇందులో కేంద్రం వాటా 60 శాతం కాగా రాష్ట్ర వాటా 40 శాతం ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన ఫైల్‌కు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్ బీఎం) ద్వారా పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందించింది. పనులు వేగవంతం చేయాలని, చేసిన పనులకు ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేసేలా అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఏడాది 1,90,166 టాయిలెట్ల నిర్మాణం
ఈ ఏడాది(2025-26) గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిధులతో ప్రభుత్వం వ్యక్తిగత టాయిలెట్ల నిర్మించబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 1,90,166 టాయిలెట్ల కోసం 228 కోట్ల 19లక్షల 2వేల రూపాయలు మంజూరు చేసింది. ఒక్కో టాయిలెట్ కోసం రూ.12,573 వేల చొప్పున కేటాయించింది. పర్యాటక, మతపరమైన ప్రదేశాలు, పాఠశాలలు, మార్కెట్ స్థలాలు, ఆసుపత్రులు, బస్ స్టాండ్‌లు, మండల కేంద్రాల్లో అవసరం, జనం రద్దీని బట్టి కామన్ సానిటేషన్ కాంప్లెక్స్‌లు (సాముహిక టాయిలెట్లు) నిర్మించనున్నది. ఇందు కోసం ఒక్కో కాంప్లెక్స్‌కు రూ.3 లక్షల చొప్పున కేటాయించనుంది. మొత్తం 395 కామన్ సానిటేషన్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం రూ.11.85 కోట్లు మంజూరు చేసింది.
Also read: Jobs In TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఖాళీల వివరాలివే
వ్యర్థాలతో కొత్త ఉత్పత్తులు
ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు గృహాలు, వ్యాపారాలు, రద్దీ ప్రాంతాలతోపాటు వివిధ వనరుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రెసిన్ గుర్తింపు కోడ్‌లు (ఆర్ఐసీఎస్) ఆధారంగా వివిధ రకాల వస్తువులుగా మార్చుతారు. ప్రాసెస్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ లేదా ఇతర రికవరీ ప్రక్రియల ద్వారా మానవ అసవరాలకు ఉపయోగించే ఉత్పత్తులను తయారు చేస్తారు. పునర్వినియోగం చేయడానికి వ్యర్థాలను రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ప్రజా సంక్షేమమే ధ్యేయం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాం. అందులో భాగంగానే స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.516.40 కోట్లు మంజూరు చేశాం. అందులో గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు నిర్మాణం చేయబోతున్నాం. గ్రామాల్లో ప్లాస్టిక్‌తో వర్షపు నీరు ఇంకిపోకుండా అడ్డుకుంటున్నది భూగర్భ జలాలు పెరగకుండా నిరోధిస్తున్నాయి. దీంతో భవిష్యత్ తరాలకు ముంపు ఏర్పడుతుందని భావించి ప్లాస్టిక్ నియంత్రణకు యూనిట్లు పెట్టి యువతకు ఉపాధితో పాటు గ్రామాలకు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఒక్కో యూనిట్‌కు 64 లక్షలతో నిర్మాణం చేపడుతున్నాం.