Telangana Govt: ప్రభుత్వ ఖజానాకు భారీ ఊరట…?
అద్దె భవనాల్లోని కార్యాలయాలు షిప్ట్
ఏటా రూ. 800 కోట్ల ఆదాయం సేప్
ఆర్ధిక భారం నుంచి విముక్తి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతూ ప్రజా ధనాన్ని అద్దెల రూపంలో వెచ్చిస్తున్న తీరుకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 28వ తేదీని డెడ్‌లైన్‌గా విధిస్తూ, అన్ని శాఖలను ప్రభుత్వ సొంత భవనాల్లోకి తరలించాలని ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 60కి పైగా ప్రభుత్వ శాఖలు ప్రైవేటు అద్దె భవనాల్లో పనిచేస్తున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఈప్రైవేటు భవనాల అద్దెలకు ఏటా సుమారు రూ.800 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వ శాఖలు రూ. 450 కోట్లు, కార్పొరేషన్, ఇతర సంస్థలకు రూ. 350 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తున్నది. ఈ లెక్కన గత 12 ఏళ్లలో అద్దె వ్యయం మొత్తం రూ. 9,600 కోట్లకు చెల్లించినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ భారం తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్‌లోని ప్రభుత్వానికి చెందిన భవనాల్లో సుమారు 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అధికారులు గుర్తించారు. హిమాయత్‌నగర్, నాంపల్లి, అమీర్‌పేట్, హైటెక్స్–నాక్, టీ హబ్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భవనాలకు జనవరి 28లోగా శాఖలు తరలి వెళ్లాలని సర్కార్ గతంలోనే ఆదేశాలను జారీ చేసింది. అంతేగాక మార్చి 31 తర్వాత ప్రైవేటు భవనాలకు ఇక అద్దె చెల్లింపులు ఉండవని ప్రభుత్వం నొక్కి చెప్పింది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆదా కానున్నది.
Read Also- BRS Party: మునిసిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పకడ్బంధీ వ్యూహం!
ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్రాంగణాలు…
నగర నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భవనాలు, స్థలాలు నిరుపయోగంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అంతేగాక ఆయా ల్యాండ్స్, బిల్డింగ్ లు ఉండగా, ప్రైవేటు వ్యక్తులకు అద్దెలు చెల్లించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో సుమారు 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని గుర్తించామని, వెంటనే షిప్ట్ కావాలని ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. సర్కార్ ఆదేశాలను స్పష్టంగా పాటించాల్సిందేనని, ఒకవేళ ఏవైనా శాఖలు మొండికేస్తే, మార్చి 31 తర్వాత వాటికి ప్రైవేటు అద్దెలను చెల్లించడం నిలిపివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాబోయే ఐదేళ్లలో వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ఆదా అయ్యే అవకాశం ఉంది.
Read Also- Bhatti Vikramarka: మధిర మున్సిపల్ నాయకుల సమావేశంలో.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..?
పాలన వికేంద్రీకరణ.. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ…
సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాలన వికేంద్రీకరణతో పాటు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కూడా లభించనున్నది. ప్రభుత్వం ఎంపిక చేసిన వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ భవనాలు కళకళలాడనున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు భవనాల్లో ఇరుకైన సదుపాయాల కంటే, విశాలమైన ప్రభుత్వ ప్రాంగణాల్లో సేవలు మెరుగుపడతాయి. ఉద్యోగుల సేవల్లోనూ క్వాలిటీ పెరగనున్నది. అంతేగాక నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఉపయోగంలోకి వస్తాయి. ఇదిలా ఉండగా, సంక్షేమ పథకాలకు నిధుల సర్దుబాటు సవాలుగా మారిన తరుణంలో, ఇలాంటి వృథా ఖర్చులను అరికట్టడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ఆఫీసర్లు వివరిస్తున్నారు. అప్పులు తగ్గడంతో ఆర్ధిక వ్యవస్థ సర్దుబాటుకు గురయ్యే అవకాశం ఉన్నదని వివరిస్తున్నారు. తద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మెరుగుడ పడి ప్రజ ప్రయోజనాలకు సరైన సమయంలో ఆర్ధిక నిధులు సమకూరుతాయని అధికారులు చెప్తున్నారు.

