Fee Reimbursement: తెరపైకి గత సర్కార్ విజిలెన్స్ నివేదిక
నిబంధనలు పాటించడంలేదని ఆగ్రహం
సమ్మె విరమణకు ప్రయత్నాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కార్ సమాలోచనలు
కాలేజీ అకౌంట్‌లో కాకుండా విద్యార్థి ఖాతాకు డబ్బులు వేసేలా యోచన
తల్లిదండ్రుల పేరిట జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసే ఛాన్స్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలనే (Fee Reimbursement) డిమాండ్‌తో కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేట్ యాజమాన్యాలకు సర్కార్ సీరియస్‌గా ఉంది. రివర్స్‌గా గట్టి ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఇంజినీరింగ్, వృత్తివిద్య, డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌కు పిలుపునివ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులపై ఇప్పటికే సానుకూల చర్యలు చేపడుతున్నప్పటికీ బంద్ పాటించడంపై సర్కార్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కాలేజీలు ప్రమాణాలు పాటిస్తున్నాయా? లేదా? అనే అంశంపై గత బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన విజిలెన్స్ నివేదికను ఈ సర్కార్ అస్త్రంగా మలుచుకోనున్నట్లు సమాచారం. ఈ అస్త్రాలను వినియోగించి సమ్మె విరమణకు మార్గం సుగమం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రైవేట్ యాజమాన్యాలు బంద్‌కు పిలుపునివ్వడంతో ఆదివారం అర్ధరాత్రి వరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కార్యదర్శులు, ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలతో భేటీ అయ్యారు. బకాయిల అంశంపై సోమవారం నాటికి ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యాలకు హామీ ఇవ్వడంతో వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. కానీ, బంద్ కొనసాగించడంతో ప్రైవేట్ యాజమాన్యాల తీరుపై సర్కార్ ఆగ్రహం వ్యక్తంచేసింది. అందుకే విద్యాప్రమాణాలు, మౌలిక వసతుల కల్పన, ఫేక్ అటెండెన్స్, ఫేక్ ఫ్యాకల్టీ వంటి పలు అంశాలపై దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. ఇలా చేపడుతున్న ప్రైవేట్ యాజమాన్యాలపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
Read Also- Maruti Victoris: సరికొత్త కారును ఆవిష్కరించిన మారుతీ సుజుకీ… ధర, ఇతర వివరాలు ఇవే
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో చాలా కాలంగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రైవేట్ యాజమాన్యాల బంద్ తో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. కొన్ని కాలేజీలు కేవలం ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బుల కోసమే నకిలీ విద్యార్థులను సృష్టించి, వారి పేరిట రు రీయింబర్స్‌మెంట్ నిధులు పొందుతున్నట్లుగా సర్కార్ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. 2012లో ఈ స్కామ్ లో రూ.1,500 కోట్లు నిధులు దుర్వినియోగమైనట్లు వార్తలు వచ్చాయి. ఎలాంటి అర్హత లేని విద్యార్థుల పేర్లను చేర్చి వారి పేరిట నిధులు స్వాహా చేయడం ద్వారా ఈ స్కామ్ జరిగినట్లు తెలిసింది. అంతేకాకుండా పలు యాజమాన్యాలు ప్రభుత్వం ఆమోదించిన ఫీజుల కంటే ఎక్కువ మొత్తాలను రీయింబర్స్‌మెంట్‌గా క్లెయిమ్ చేస్తున్నట్లుగా సర్కార్ దృష్టికి వచ్చింది. ఈ విద్యాసంవత్సరం కూడా కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఫీజుల పెంపును సమర్థించుకోవడానికి నకిలీ ప్లేస్‌మెంట్ డేటాను సమర్పించాయని విద్యార్థి సంఘాలు ఆరోపించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అక్రమాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు కళాశాలల ఖాతాలకు బదులుగా నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తల్లిదండ్రుల పేరిట జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశమున్నట్లు సమాచారం. తద్వారా నిధుల మళ్లింపును అరికట్టవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. లేదా ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఉపయోగించడం ద్వారా భౌతిక లావాదేవీలను తగ్గించి, మోసాలను అరికట్టడంపైనా దృష్టిసారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హతకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం ద్వారా బోగస్, నకిలీ విద్యార్థులను గుర్తించే అంశంపైనా దృష్టిసారించే అవకాశముందని సమాచారం. ఇదిలా ఉండగా ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో స్టైఫండ్ చెల్లింపుల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Read Also- Pakistan: అతడు ఉంటే ఆసియా కప్‌లో తర్వాతి మ్యాచ్ ఆడబోం.. పాకిస్థాన్ డిమాండ్!
అక్రమాలను అరికట్టడానికి, నిధుల విడుదల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం కళాశాలలను గ్రేడ్ల వారీగా విభజించాలని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, నిబంధనలను పాటించే కళాశాలలకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలపై దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గడిచిన విద్యాసంవత్సరం నాటికి రూ.7500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ ఏడాది రూ.2700 కోట్లు బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1200 కోట్ల టోకెన్ అమౌంట్ కూడా మంజూరు చేయలేదని ప్రైవేట్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే కళాశాలల ఒత్తిడికి తలొగ్గిన సర్కార్ రూ.1,200 కోట్ల బకాయిలను రెండు విడుతల్లో ఇవ్వాలనే ఆలోచనపైనా యాజమాన్యాలతో చర్చించినట్లు తెలిసింది. మరి దీనిపై సర్కార్ తుది నిర్ణయం ఏంటనేది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది.