Telangana Government: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, పరిశ్రమల విస్తరణ మూలంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీ స్థాయిలో పెరుగుతుందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఈ పెరుగుదలను తట్టుకునేలా పటిష్టమైన సరఫరా, పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన విద్యుత్ సంస్థల సీఎండీలకు ఆదేశించారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నవీన్ మిట్టల్ మంగళవారం విద్యుత్ సంస్థల సీఎండీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధి ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉండటంతో ఇక్కడ వార్షిక విద్యుత్ డిమాండ్ మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందన్నారు.
దీనికి అనుగుణంగా అన్ని సంస్థలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రస్తుత వానాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అధికారులు, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉంటూ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని సీఎండీలకు తెలిపారు. సమీక్షకు ముందు, నవీన్ మిట్టల్ విద్యుత్ సౌధలోని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌తో సమావేశమై, అనంతరం స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్, ఇతర విభాగాలను సందర్శించారు. ఆ తర్వాత మింట్ కాంపౌండ్‌లో ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీతో సమీక్ష నిర్వహించి, డేటా సెంటర్, ఇతర విభాగాలను పరిశీలించారు.
BJP MLA Suryanarayana: బీసీ రిజర్వేషన్లు తేలాకే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలి.. బీజేపీ ఎమ్మెల్యే
డిమాండ్ పెరుగుదల, భవిష్యత్ ప్రణాళికలు..
ఈ సందర్భంగా సీఎండీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా-పంపిణీ వ్యవస్థ గురించి నవీన్ మిట్టల్‌కు వివరించారు. రాష్ట్రంలో డిమాండ్ ఏటా సగటున 10 శాతం వృద్ధి నమోదు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డిమాండ్ 15-20 శాతం వరకు నమోదవుతుందని వివరించారు. ఈ ఏడాది తెలంగాణలో 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైందని తెలిపారు. ఎస్‌పీడీసీఎల్‌లో 2023తో పోలిస్తే 2024లో గరిష్ట డిమాండ్ 5.36 శాతం పెరగగా, గతేడాదికి – ఈ ఏడాదికి డిమాండ్ 11.71 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. ఈ పెరుగుదలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు ఐదేండ్ల ప్రణాళికను రూపొందించి, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటు, అదనపు పీటీఆర్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నట్లు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు వివరించారు.