Rajiv yuva vikasam Scheme: మీరు నిరుద్యోగా? ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్నారా? లేదా వ్యాపారం చేయాలని ఉన్న ఆర్థిక స్తోమత సరిపోక సాయం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ అవకాశం మీ కోసమే. తెలంగాణ ప్రభుత్వం మీలాంటి వారి కోసం ఓ కొత్త పథకాన్ని రూపొందించింది. కష్టపడాలని ఉండి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహకారం అందించనుంది . అదే ‘రాజీవ్ యువ వికాసం’.
ఇటీవలే ఈ పథకాన్ని ప్రకటించిన సర్కార్… ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిషికేషన్ ను విడుదల చేసింది. మీరు చేయవలసిందల్లా దరఖాస్తు చేసుకోవడమే. ఎప్పట్నుంచి చేసుకోవాలి? అసలు స్కీం దేనికోసం? ఎవరు అప్లై చేసుకోవాలి? అనే కదా మీ సందేహం. అన్నీ తెలుసుకుందాం.
బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం’ పేరిట పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో సర్కారు ఈ స్కీమ్ ను రూపొందించింది. సుమారు రూ. 6వేల కోట్లు దీని కోసం ఖర్చు చేయబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల వెల్లడించారు. రేపటి(సోమవారం) నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ దరఖాస్తులు అందిన తర్వాత వాటిని పరిశీలన జరిపి అర్హులైన వారికి ప్రభుత్వం లోన్లు ఇస్తుంది. ఆ లోన్లకు భారీగా రాయితీ ఉంటుంది.
ఈ స్కీమ్ కు సంబంధించి శనివారం ప్రభుత్వం నోటిషికేషన్ విడుదల చేసింది. ఆ మేరకు మార్చి 17వ తేదీ(సోమవారం) నుంచి సంబంధిత వర్గాల నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒక్కో లబ్దిదారుడికి గరిష్ఠంగా రూ.3 లక్షల వరకూ ఆర్థిక సాయం అందించాలని సర్కార్ నిర్ణయించింది.
3 కేటగిరీలుగా లోన్ల మంజూరు..
ప్రభుత్వం మూడు కేటగిరీలుగా రుణాలను ఖరారు చేయనుంది. మొదట కేటగిరీ-1 కింద రూ.లక్ష వరకు రుణాలు అందించనుంది. ఇందులో 80 శాతం వరకు రాయితీ ఉంటుంది. మిగతా 20 శాతం లబ్ధిదారుడు కట్టవలసి ఉంటుంది. అదీ కూడా కట్టలేని పరిస్థితి ఉంటే… బ్యాంకు లోను తీసుకోవచ్చు. ఇక, కేటగిరీ-2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో రాయితీ 70 శాతం లభిస్తుంది. అలాగే కేటగిరీ -3 లో రూ. 3 లక్షల వరకు రుణమిచ్చి 60 శాతం రాయితీ వస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
ఈనెల 17 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలన్నీ https://tgobmms.cgg.gov.in/ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు సంక్షేమశాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఐటీడీఏ అధికారుల్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. లబ్ధిదారుల్లో అర్హులను ఎంపికచేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న పేర్లను ప్రకటించనుంది. కాగా యువత అభ్యున్నతి గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బందులు పడ్డారని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని రూపొందించామని తెలిపారు. యువకులు డోంట్ మిస్ దిస్ స్కీం.. ఒక్క స్కీంతో మీ లైఫ్ సెటిల్.
Also Read:
Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. కీలక సూచన చేసిన టిటిడి..