SERP Survey: అత్యంత పేదలను గుర్తించేందుకు సర్కార్ ప్లాన్!
SERP Survey (imagecredit:twitter)
Telangana News

SERP Survey: రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించేందుకు సర్కార్ ప్లాన్.. త్వరలో సర్వే..!

SERP Survey: రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించి వారికి అండగా నిలవాలని ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. కేవలం రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోకుండా, వారి ఆర్థిక పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసి చేయూతనివ్వనుంది. ఐదు ప్రధాన అంశాలతో అత్యంత పేదలను గుర్తించేందుకు ‘సెర్ప్’ మార్గదర్శకాలను రూపొందించింది. పేదల భాగస్వామ్య గుర్తింపు (పిప్) విధానం ద్వారా ఈ ప్రక్రియ సాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభం కానుంది. ప్రజలు దరఖాస్తు చేసుకునే పాత పద్ధతికి భిన్నంగా, ప్రభుత్వమే నేరుగా ప్రజల భాగస్వామ్యంతో నిరుపేదలను వెలికితీయనుంది.

సెర్ప్ ఆధ్వర్యంలోనే..

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలే ఈ గుర్తింపు ప్రక్రియను చేపట్టబోతున్నారు. గ్రామంలో ధనికులు, మధ్యతరగతి, నిరుపేదలు ఎవరనేది అక్కడి నివాసితులకు ఉన్న అవగాహనను ప్రభుత్వం ఆసరాగా చేసుకోనుంది. కేరళ తరహాలో తెలంగాణలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ విధానం వల్ల అనర్హులకు తావుండదని, కేవలం రాజకీయ జోక్యం లేకుండా మహిళా సంఘాల (వీఓలు, ఎంఎస్‌లు) పర్యవేక్షణలోనే ఈ సర్వే జరుగుతుందని అధికారులు తెలిపారు.

Also Read: Tiger Estimation 2026: రేపటి నుంచే టైగర్ ఎస్టిమేషన్.. వన్యప్రాణుల స్థితిగతులపై సమగ్ర నివేదిక!

ఐదు దశల్లో ప్రక్రియ

నిరుపేదలను గుర్తించడానికి ప్రభుత్వం 5 దశల వ్యూహాన్ని అనుసరించబోతోంది. తొలుత సోషల్ మ్యాపింగ్ ద్వారా గ్రామస్తులంతా కలిసి గ్రామానికి సంబంధించిన మ్యాప్‌ను గీస్తారు. ఇందులో ప్రతి ఇల్లు, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి గుర్తులు వేస్తారు. రెండో దశలో గ్రామస్తుల చర్చల ద్వారా అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నవారిని వర్గీకరిస్తారు. మూడో దశలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు ఇంటింటికీ వెళ్లి పరిశీలించి జాబితాను సరిచూస్తారు. నాలుగో దశలో రూపొందించిన ముసాయిదాను గ్రామసభలో చదివి వినిపించి అభ్యంతరాలను పరిష్కరిస్తారు. చివరిగా, గ్రామసభ ఆమోదించిన జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేసి అధికారుల తుది పరిశీలనకు పంపిస్తారు.

ఉపాధి మార్గాల ద్వారా..

రోజువారీ కూలి దొరకక పస్తులుండే కుటుంబాలు, సొంతిల్లు, భూమి లేని నిరాశ్రయులు, పని చేయలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ఉన్న కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించనున్నారు. అలాగే మగ దిక్కులేని ఒంటరి మహిళలు, వితంతువులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ మందులు కొనుక్కోలేని స్థితిలో ఉన్నవారు, సామాజికంగా వెనుకబడిన వర్గాల్లోని నిరక్షరాస్యులను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం కేవలం సాయం అందించడమే కాకుండా, వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించడం. ఇందులో భాగంగా వారికి ఉపాధి మార్గాలను చూపిస్తూ గొర్రెలు, బర్రెలు పంపిణీ చేయడం లేదా కిరాణా షాపు వంటి చిన్న తరహా వ్యాపారాలు పెట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రభుత్వం అందించే పెన్షన్, రేషన్, ఇల్లు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలన్నీ వీరికి తప్పనిసరిగా వర్తించేలా చర్యలు తీసుకుంటారు. అవసరమైతే వీరి కోసం ప్రత్యేక నిధులను కేటాయించి, కనీస జీవన ప్రమాణాలను మెరుగుపరచనున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, కేవలం మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే పారదర్శకంగా సర్వే నిర్వహించి నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలను అందించనున్నారు.

Also Read: AR Rahman: ఎవరినీ బాధపెట్టాలని కాదు.. వెనక్కి తగ్గిన రెహమాన్.. వీడియో వైరల్!

Just In

01

GHMC: ఇక మిగిలింది 23 రోజులే.. జీహెచ్‌ఎంసీ పాలన ముగింపు..?

Spain Train Accident: ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్ రైళ్లు.. ఏటు చూసినా రక్తమే!

Ramchander Rao: తులసి వనంలో ‘గంజాయి మొక్కలు’.. కాంగ్రెస్ పై రాంచందర్ రావు ఫైర్..!

Gadwal Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఓకరు మృతి..!

PM Modi: చొరబాటుదారులకు భూములా.. కలియాబోర్ సభలో ప్రధాని మోదీ నిప్పులు..?