Weavers Loan Waiver: మార్చిలోగా చేనేత రుణమాఫీ చేస్తాం
6,784 మందికి 27.14 కోట్లు మంజూరు
ప్రతి ఏటా చేనేత భరోసా కింద 12.21 కోట్లు
పావలా వడ్డీ కింద 109కోట్లు
తీసుకో ద్వారా చేనేత కార్మికుల నుంచి 587 కోట్ల విలువైన వస్త్ర కొనుగోలు
చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: చేనేత కార్మికులు వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలను మార్చిలోగా మాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శాసనమండలిలో సోమవారం ఆయన మాట్లాడారు. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం 6,784 మంది నేతన్నలకు రూ.27.14 కోట్లు రుణమాఫీ చేయనున్నట్లు వివరించారు. నేత కార్మికులు పొదుపు నిధికి 8 శాతం చెల్లిస్తే ప్రభుత్వం 16 శాతం ఇస్తుందని, దీని కింద రూ.303 కోట్లు రిలీజ్ చేశామన్నారు.
ఇక, భరోసా కింద ఏటా రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.8,000 చొప్పున ఇస్తున్నామని, అందుకోసం రూ.12.20 కోట్లు మంజూరు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పావలా వడ్డీ రుణాల కింద రూ.109 కోట్లు కేటాయించామన్నారు. వస్త్ర సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అందుకోసం చేనేత కార్మికుల నుంచి రూ.587 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు చీరల పంపిణీ ఆర్డర్ సైతం చేనేత కార్మికులకు ఇస్తున్నామని, వారికి పూర్తిస్థాయి పని కల్పిస్తున్నామని వెల్లడించారు. 21 జిల్లాల్లోని వ్యక్తిగత నేత కార్మికులు రుణమాఫీ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. చేనేత ఉత్పత్తులతో మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి చేనేత జౌలి శాఖ జాతీయ చేనేత, రాష్ట్రస్థాయి చేనేత ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉందని, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రకటించారు.
Read Also- Medaram Jathara: అసెంబ్లీలో మేడారం సందడి.. ఆహ్వాన పత్రిక అందజేత

