Duddilla Sridhar Babu: స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ’గా తెలంగాణను మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులతో ఆయన సచివాలయంలో భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలను వివరించారు.
‘సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్ లో దిగ్గజ సంస్థగా ఉన్న ఆర్మ్ హోల్డింగ్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. పరిశ్రమ ఏర్పాటులో అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాకున్న పెద్ద ఆస్తి యువత అన్నారు. పరిశ్రమలకు అవసరమైన రెడిమేడ్ మానవ వనరులను అందించే బాధ్యతను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా మా ప్రభుత్వం తీసుకుందని వివరించారు.
Also Read: Revanth Reddy: కేసీఆర్ ను కాంగ్రెస్ లోకి రానీవ్వను.. సీఎం సంచలన వాఖ్యలు!
సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్ లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. 10వేల మంది యువత శిక్షణనిచ్చే బాధ్యతను తీసుకోవాలని మలేషియాకు చెందిన దిగ్గజ సంస్థ “స్ర్పింగ్ సెమీ కండక్టర్స్ సీఈవో కెన్ కూను కోరారు. ‘తెలంగాణను స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. మా వంతుగా ఇక్కడి యువతను సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్ లో అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చి దిద్దేలా ప్రత్యేక కరిక్యులమ్ ను రూపొందిస్తాం.
విద్యా సంస్థల సహకారంతో ఆరు నెలలు ఇక్కడ శిక్షణ… మిగిలిన కాలం తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో ఇంటర్న్ షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. టీ కన్సల్ట్ సహకారంతో 2030 నాటికి 10వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తాం అని కెన్ కూ… మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. కార్యక్రమంలో టీ కన్సల్ట్ ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా, వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ మలేషియా విభాగం ప్రెసిడెంట్ మారుతీ, ఇతర ప్రతినిధులు మహేష్ నటరాజ్, వాకిటి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Also Read: KCR: ప్రాజెక్ట్ టెక్నికల్ అంశాలన్నీ వారే తీసుకున్నారు!