TG Cancer Care: జిల్లాల్లోనూ క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సను అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేషెంట్లకు వరంగా మారింది. రెండు నెలల క్రితం అన్ని జిల్లాల్లో క్యాన్సర్‌కు చికిత్సను అందించాలనే ఉద్దేశ్యంతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha) ఆదేశాలతో ‘డిస్ట్రిక్ట్ క్యాన్సర్ కేర్ సెంటర్లను’ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 15న లాంచ్ చేసిన ఈ కేంద్రాల ద్వారా పేషెంట్లకు క్వాలిటీ వైద్యం అందుతున్నది. సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 23 వరకు అన్ని జిల్లాల్లో 313 మంది క్యాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ అందించినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెగ్యులర్ చెకప్‌ల నుంచి కీమోథెరపీల వరకు అన్నీ రకాల సేవలను జిల్లా స్థాయి డీసీసీ (డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్స్)లలోనే అందించడం గమనార్హం. ములుగు(Mulugu), భద్రాద్రి లాంటి ఏజెన్సీ ప్రాంతాల క్యాన్సర్ పేషెంట్లు కూడా సొంత జిల్లాల్లోనే ట్రీట్‌మెంట్ చేయించుకునే సౌకర్యాలు వచ్చాయి. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో కీలకంగా ప్రయోగించే కీమోథెరపీ కూడా జిల్లా స్థాయి కేంద్రాల్లోనే నిర్వహించడం గొప్ప విషయం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేషెంట్లకు భరోసా ఇవ్వడమే కాకుండా, హైదరాబాద్(Hyderabad)లోని క్యాన్సర్ దవాఖాన్లపై ఒత్తిడిని కూడా తగ్గిస్తున్నట్లు ఆరోగ్యశాఖ ఆఫీసర్లు వివరించారు. డీసీసీలను తాము ప్రారంభించిన రెండు నెలల్లోనే సక్సెస్ ఫుల్‌గా రన్ చేయడం సంతోషాన్ని కలిగిస్తుందని అంకాలజిస్టులు చెబుతున్నారు.
ఆ ఐదు జిల్లాల నుంచే ఎక్కువ మంది?
ఖమ్మం(Khammam), నల్లగొండ(Nalgonda), నాగర్ కర్నూల్(Nagarkarnul), సంగారెడ్డి(Sangareddy), భద్రాద్రి కొత్తగూడెం(Kothagudem) జిల్లాల నుంచే అత్యధిక మంది పేషెంట్లు కీమోథెరపీ చేయించుకున్నట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ఖమ్మంలో 44 మంది, నాగర్‌కర్నూల్‌లో 37, సంగారెడ్డిలో 18, కొత్తగూడెంలో 21 మందికి ఇప్పటి వరకు కీమోథెరపీ చేశారు. సంగారెడ్డి మినహాయించి మిగతా కేంద్రాలన్నీ రూరల్ ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో డీసీసీలు సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లకు అన్ని రకాల మందులు ఇచ్చేందుకు బఫర్ స్టాక్‌ను కూడా మెయింటెన్ చేస్తున్నారు. 38 రకాల మందులను అన్ని డీసీసీలలో స్టాక్ పెట్టినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులలో ఈ డీసీసీలు కొనసాగుతున్నాయి.
Also Read: Telangana BJP: లోకల్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు కమలం సిద్ధం.. నెక్స్ట్ ప్లాన్ ఇదేనా..!
హైదరాబాద్‌కు తగ్గుతున్న ఒత్తిడి.. పేషెంట్లకూ తప్పిన శ్రమ?
ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే చాలు.. ఆ కుటుంబం మొత్తం ఆందోళనలో కూరుకుపోయేది. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే లేదా ఇతర కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వచ్చేది. రవాణా ఖర్చులు, ఉండేందుకు వసతి, శారీరక శ్రమ.. ఇలా రోగితో పాటు కుటుంబ సభ్యులు కూడా నరకం అనుభవించేవారు. జిల్లాల నుండి రోగులు వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ లేదా వరంగల్ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ కష్టాలు తప్పాయి. ‘ఎక్కడి పేషెంట్లు అక్కడే ’ చికిత్స పొందాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజారోగ్య రంగంలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది. క్యాన్సర్ వంటి వ్యాధితో పోరాడుతున్న వారికి సొంత ఊరికి దగ్గరలో వైద్యం అందడం అంటే.. వారికి సగం బలం చేకూరినట్లే. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం వేసిన అడుగు విజయవంతమైందని ప్రస్తుత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
డీసీసీల ను ఆశ్రయించిన పేషెంట్ల వివరాలు
నెల కవరైన జిల్లాలు కీమోథెరఫీ పేషెంట్లు
సెప్టెంబరు 15 నుంచి 30 వరకు 16 32
అక్టోబరు1 నుంచి 31 వరకు 28 152
నవంబరు1 నుంచి23 వరకు 33 129
Also Read: Yuva Sarpanch: నామినేషన్ రెండో రోజే ఎన్నిక ఏకగ్రీవం.. సర్పంచ్‌గా 24 ఏళ్ల కుర్రాడు

