Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పేర్కొన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ముందెన్నడూ లేని రీతిలో 70.82 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసి రికార్డ్ నెల కొల్పిందన్నారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. గతంలో కొనుగోలు చెసిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డ్ ను ఈ ఖరీఫ్ సీజన్ అధిగమించిందని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో చారిత్రక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, నీటిపారుదల శాఖాలు సమన్వయం చేయడంతో పాటు తెలంగాణా రైతాంగం భాగస్వామ్యం ఈ రికార్డులో భాగస్వామ్యం ఉందని తెలిపారు. ధాన్య సంపదకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినం జరుపుకుంటున్న తెలంగాణా రాష్ట్ర రైతాంగానికి,రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పర్వదినాన్ని పురస్కరించుకుని రంగవల్లులు అద్దుతున్న మహిళలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
రైతులకు మద్దతు ధర
ధాన్యం దిగుబడిలో రైతుల కృషిని అభినందించిన ఆయన, వ్యవసాయ రంగంపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానాలకు అద్దం పడుతుందన్నారు.ప్రభుత్వం కొనుగోలు చేసిన 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం కాగా 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలని ఆయన వివరించారు. రాష్ట్రంలో సాధించిన దిగుబడికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 13.97 లక్షల మంది రైతులకు మద్దతు ధర అందించమన్నారు.
ముందెన్నడూ లేని రీతిలో..
కొనుగోలు చేసిన ధాన్యం మొత్తానికి 16,912 కోట్లు పై చిలుకని కాగా ఇందులో ఇప్పటికి 16,602 కోట్లు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో సన్నాలను ప్రార్థించేందుకు గాను ముందెన్నడూ లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ ను సన్నాలు పండించిన రైతాంగాం ఖాతాలో జమ చేశామని ఇప్పటి వరకు 1,425 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయిన నేపద్యంలో కొనుగోలు ప్రక్రియ కుడా ప్రభుత్వం ఒక సవాల్ గా స్వీకరించి 8,448 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్లనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. ధాన్యం దిగుబడిలోనే కాదు, ధాన్యం కొనుగోలులోనూ తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని ఇందులో ప్రధాన భాగస్వామ్యం తెలంగాణ రైతాంగానిదేనని కొనియాడారు.

