Ramreddy Damodar Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అనారోగ్యం కారణంగా బుధవారం రాత్రి ప్రాణాలు విడిచారు. తెలంగాణ రాజకీయాల్లో ‘టైగర్ దామన్న’గా ఎంతో కీర్తిని గడించిన ఆయన.. ఒక్కసారిగా లేరన్న వార్తతో కాంగ్రెస్ కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం దామన్న మృతి పట్ల సంతాపం తెలియజేశారు.
సీఎం దిగ్భ్రాంతి…
సీనియర్ నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. 5 సార్లు శాసనసభ సభ్యుడిగా నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ జిల్లా అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. దామోదర్ రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు, బంధువులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అటు సీఎఓ కార్యాలయం సైతం దామన్న మృతి పట్ల సంతాపం ప్రకటించింది.
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం తీవ్ర ఆవేదనను కలిగించింది.
ఐదు సార్లు శాసన సభ్యుడిగా, మంత్రిగా సేవలు అందించి, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు.… pic.twitter.com/Men6x6WDE8— Revanth Reddy (@revanth_anumula) October 2, 2025
మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు మరణించారని తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయిదు సార్లు శాసనసభ సభ్యుడిగా దామోదర్ రెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ జిల్లా అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని… pic.twitter.com/jKj5fU6Ojf
— Telangana CMO (@TelanganaCMO) October 1, 2025
మంత్రులు సంతాపం
రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఇక లేరన్న వార్త తెలుసుకొని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటీనా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన పార్థివ దేహాన్ని దర్శించి.. తీవ్ర సంతాపం తెలియజేశారు. శోక సంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఉత్తమ్ ఓదార్చారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ సైతం దామోదర్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుటుంబంలో నిబద్ధత కలిగిన కార్యకర్త నుంచి రాష్ట్ర మంత్రి స్థాయికి ఆయన ఎదిగారని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
అంతిమ సంస్కారాలు
దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని ఇవాళ రాత్రి (అక్టోబర్ 2) వరకూ ఏఐజీ లేదా కిమ్స్ ఆస్పత్రి కూల్ మార్చురీలోనే ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. 3 వ తేదీ ఉదయం 6.00 గంటల నుండి 11.00 గంటల వరకు హైదరాబాద్ లోని స్వగృహంలో పార్ధివ దేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యపేటకు తరలిస్తారు. అక్కడి రెడ్ హౌస్ లో పార్థివ దేహాన్ని ఉంచి.. 2 గంటల నుంచి 6 గంటల మధ్య కార్యకర్తల సందర్శనకు అనుమతిస్తారు. అదే రోజు రాత్రికి తుంగతుర్తి లోని స్వగృహానికి దామోదర్ రెడ్డి దేహాన్ని తీసుకెళ్లనున్నారు. మరునాడు 4వ తేదీన ఉదయం 11 గంటల వరకూ స్థానికుల సందర్శనకు అనుమతిచ్చి.. 11.30 గంటల తర్వాత అంత్యక్రియలు ప్రారంభించనున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు.
Also Read: Money Lending Act: రైతులకు మనీ లెండింగ్ యాక్ట్ అమలు.. అమల్లోకి రానున్న చట్టం
రాజకీయ నేపథ్యం..
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాత లింగాల గ్రామంలో 1952 సెప్టెంబర్ 14న దామోదర్ రెడ్డి జన్మించారు. కాంగ్రెస్ లో కార్యకర్త స్థాయి నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. అంచలంచెలుగా ఎదిగారు. సూర్యపేట జిల్లా తుంగతుర్తి నుంచి 1985-2009 మధ్య ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి.. నాలుగు సార్లు విజయం సాధించారు. ఈ క్రమంలోనే 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినేట్ లో మంత్రిగానూ వ్యవహరించారు. అయితే 2014-23 మధ్య జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపలేకపోయారు. పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న క్రమంలో ఆయన మరణించడం గమనార్హం.