Damodar Raja Narasimha: రాష్ట్ర వైద్య ఆరోగ్య చరిత్రలో మరో భారీ నియామక ప్రక్రియ పూర్తయింది. ఒకేసారి 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు (గ్రేడ్-2) నియామక పత్రాలను అందజేసే బృహత్తర కార్యక్రమం కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) హాజరయ్యారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌లతో కలిసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా వేగంగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు.
257 మంది ఉద్యోగాలకు ఎంపిక
2024 సెప్టెంబర్ 11న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2025 నవంబర్ నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మొత్తం 23,323 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 1257 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు.డీఎంఈ పరిధిలో 764, డీపీహెచ్‌లో 300, టీవీవీపీలో 180, ఎంఎన్‌జేలో 13 మందికి పోస్టింగ్స్ ఇచ్చామన్నారు. ఒకప్పుడు రోగి లక్షణాలను బట్టి వైద్యం చేసేవారు. కానీ నేడు రోగ నిర్ధారణ జరిగిన తర్వాతే చికిత్స ప్రారంభిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు ఇచ్చే రిపోర్టులే డాక్టర్లకు ప్రామాణికం. వైద్య వ్యవస్థకు మీరు కళ్లు, చెవుల్లాంటి వారు. మీ రిపోర్టుల్లో కచ్చితత్వం ఎంతో ముఖ్యం. ఎన్ఏబీఎల్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ల్యాబ్స్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ల్యాబ్ టెక్నీషియన్లు తీసుకోవాలి” అని మంత్రి పేర్కొన్నారు.
రెండేళ్లలో 9572 ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో 70 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి గుర్తుచేశారు. ఒక్క ఆరోగ్య శాఖలోనే ఇప్పటివరకు 9,572 పోస్టులను భర్తీ చేశామని, మరో 7,267 పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న మరో 996 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదనంగా 2,344 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపామని మంత్రి స్పష్టం చేశారు.
ఆరోగ్య తెలంగాణ లక్ష్యం
తెలంగాణను ఆరోగ్య రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఉస్మానియా నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, ప్రతీ జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్స్, క్యాన్సర్ డే కేర్ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్, గాంధీ ఆసుపత్రిలో ఉచిత ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు.తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను సెకండరీ హెల్త్ కేర్‌గా మారుస్తున్నామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే నూతన హెల్త్ పాలసీని రూపొందించి, అమలు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఆరోగ్యశాఖను సీఎం రేవంత్ రెడ్డి తనకు ఇచ్చారని, ఈ శాఖకు మంత్రిగా ఉన్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని మంత్రి వెల్లడించారు.
Also Read: Damodar Raja Narasimha: హరే కృష్ణ సెంటర్ ఆధ్యాత్మిక ప్రారంభోత్సవంలో.. మంత్రి దామోదర్ రాజనర్సింహా

