CM Revanth Reddy: గత ప్రభుత్వం ధరణి తీసుకువచ్చి అధికారులపై నెపం నెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వివరించారు. ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేందుకు ధరణి అనే వైరస్ ను తీసుకువచ్చిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆ దరిద్రాన్ని పాత పెడతామని ఎన్నికల కంటే ముందే ఇచ్చిన హామీని భూ భారతితో నెరవేర్చామన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో “కొలువుల పండుగ” అనే పేరుతో కార్యక్రమం నిర్వహించి గ్రామ పరిపాలన అధికారులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల బీఆరెస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా వారి సమస్య పరిష్కరించలేదన్నారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన సందడి.. వాహనదారులకు ట్రాఫిక్ సీపీ కీలక సూచనలు
చరిత్రలో పోరాటాలన్నీ భూమి కోసం
రెవెన్యూ శాఖ సిబ్బందిని ఒక దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ చరిత్రలో పోరాటాలన్నీ భూమి కోసం జరిగాయన్నారు. కొమురంభీం, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి లాంటి వాళ్లు భూమి కోసమే పోరాడారన్నారు. భూమి కోసం పోరాటాలే కాదని, భూదాన్ ఉద్యమానికి పునాదులు పడింది కూడా తెలంగాణ ప్రాంతంలోనే అని వెల్లడించారు. వెదిరె రామచంద్రా రెడ్డి వేలాది ఎకరాలు పేదలకు పంచి భూదానోద్యమం చేశారని గుర్తు చేశారు. గతంలో పీవీ నర్సింహారావు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచారన్నారు. భూమిని చెరబట్టిన వారిని తెలంగాణ ప్రజలు దిగంతాలకు తరిమారన్నారు.
ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తా
గత ప్రభుత్వంలో ధరణి భూతాన్ని తెచ్చి భూములను కొల్లగొట్టాలని చూశారన్నారు. తమ దోపిడీకి వీఆర్వో, వీఆర్ఏ లు అడ్డుగా ఉన్నారని వారిని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారన్నారు. ధరణి తెచ్చిన సమస్యలతో విసిగిపోయిన ఓ రైతు ఇబ్రహీంపట్నంలో అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారన్నారు. సిరిసిల్లలో అధికారులపై తాళి బొట్టు విసిరిన పరిస్థితి అంటూ సీఎం గుర్తు చేశారు. ఇది అధికారుల వల్ల జరగలేదని, నాటి పాలకులు సృష్టించినవైరస్ అంటూ మండిపడ్డారు. అందుకే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని గతంలోనే చెప్పి, ఇప్పుడు చేసి చూపించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణి మహమ్మారిని వదిలించి భూ భారతి చట్టం తీసుకొచ్చామన్నారు.
ప్రజలకు వారధులుగా ఉండాలి..
ప్రభుత్వానికి పేద ప్రజలకు జీపీవోలు వారధులుగా నిలవాల్సిన అవసరం ఉన్నదన్నారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించేందకే జీపీవోలుగా తిరిగి నియమించామన్నారు. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా ? ఎవరో కొందరు తప్పులు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తారా? అని బీఆర్ ఎస్ ప్రభుత్వంపై సీఎం ఫైర్ అయ్యారు. వాళ్లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారన్నారు.
లక్ష కోట్లు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయిందన్నారు. కాళేశ్వరంలోని అవినీతి దొంగలను ఏం చేయాలో? ప్రజలు ఆలోచించల్సిన అవసరం ఉన్నదన్నారు. తెలంగాణ సాధనలో, ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములైన రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలన్నారు. భూ భారతి చట్టాలను అమలు చేయడమే కాదని, సాదా బైనామాల సమస్య పరిష్కరించాలన్నారు. ఇది జీపీవోల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అంటూ వెల్లడించారు. గత పాలకులు రెవెన్యూ వ్యవస్థ ఉద్యోగులను తెలంగాణా సమాజంలో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని, ఆ మచ్చను చెరిపివేసే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు. వీఆర్ ఏ, వీఆర్ వోల పై చేసిన ఆరోపణలు తప్పు అంటూ నిరూపించుకునే అవకాశం ఇందిరమ్మ ప్రభుత్వంలో వచ్చిందని సీఎం వివరించారు.
Also Read: Tollywood directors: టాలీవుడ్ టాప్ దర్శకులు ఎవరి దగ్గర పనిచేశారో తెలుసా?..