Radial Road Project: రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ రవాణాను అనుసంధానించడం, మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడేందుకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల (Radial Road Project) నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నిర్మాణాన్ని రెండు దశల్లో నిర్మించనున్నారు. రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్(టాటా ఇంటర్‌చేంజ్) నుంచి ఆమన్ గల్ రీజినల్ రింగ్ రోడ్డు(రతన్ టాటా రోడ్డు) వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం జరగనుంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపనను చేపట్టనున్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవ్వనున్నాయి. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు మొత్తం పొడవు 41.50 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఫస్ట్ ఫేజ్ లో రావిర్యాల ఓఆర్ఆర్(టాటా ఇంటర్‌చేంజ్) నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు 19.20 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. రెండో ఫేజ్ లో మీర్‌ఖాన్‌పేట నుంచి అమన్ గల్ రీజినల్ రింగ్ రోడ్డు వరకు 22.30 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనున్నారు.
Also Read:TVK Rally Stampede: తమిళ హీరో విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట.. పెద్ద సంఖ్యలో మరణాలు
రూ.1,911 కోట్లు
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.4,621 కోట్లు వెచ్చించనున్నారు. మొదటి దశలో భూసేకరణ సైతం కలుపుకుని రూ.1,911 కోట్లు ఖర్చవనుంది. ఫేజ్ 2 కు భూసేకరణ సైతం కలుపుకుని రూ.2,710 కోట్లు ఖర్చవనుంది. ఈ ప్రాజెక్టు రెండు దశల్లో కలిపి 14 గ్రామాల గుండా వెళ్లనుంది. మొదటి దశలో కొంగర ఖుర్ద్, ఫీరోజ్‌గూడ, కొంగర కలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్‌ఖాన్‌పేట్ గ్రామాల మీదుగా రోడ్డు వెళ్లనుంది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కండకూరు మండలాల్లో ఈ గ్రామాలున్నాయి. అలాగే ఫేజ్ 2 లో రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కడ్తాల్, ఆమన్ గల్ మండలాలకు చెందిన 5 గ్రామాలున్నాయి. వాటిలో కుర్మిడ్డ, కడ్తాల్, ముద్విన్, ఆకుతోటపల్లి, అమన్ గల్ ఉన్నాయి. ఇదిలా ఉండగా రైట్ ఆఫ్ వే 100 మీటర్లు ఉండగా 3+3 లేన్ మెయిన్ వేగా దీన్ని నిర్మించనున్నారు భవిష్యత్తులో 4+4 లేన్లకు విస్తరించేలా ప్రణాళికలను సిద్ధం చేశారు.
టెండర్ల కేటాయింపు అనంతరం 30 నెలల్లో నిర్మాణం
గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి రెండు దశలకు వేర్వేరుగా టెండర్లను ఆహ్వానించారు. టెండర్ల కేటాయింపు అనంతరం 30 నెలల్లో నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా సుమారు 8.94 కిలోమీటర్ల రహదారి(236.89 ఎకరాలు) 7 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌ల గుండా వెళ్లనుంది. వీటికి సంబంధించిన అనుమతులు పోర్టల్‌లో దరఖాస్తు చేయగా అవి పరిశీలనలో ఉన్నాయి. దాదాపు 310 ఎకరాల టీజీఐఐసీ భూమి (7.69 కిలోమీటర్ల పొడవు) రెండు ఫేజ్ ల ఇంటర్‌చేంజ్‌లతో కలిపి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రవాణా అనుసంధానం మరింత సులువవ్వనుంది. ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్డును నేరుగా కలిపడం వల్ల దక్షిణ జిల్లాలకు ప్రయాణ సమయం తగ్గనుంది.
ప్రాంతీయ మార్కెట్లకు రవాణా వేగవంతం
అంతేకాకుండా ప్రస్తుత మార్గాలపై రద్దీ తగ్గుతుంది. భవిష్యత్తులో మెట్రో, రైల్వే వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం సైతం పెరిగే అవకాశముంది. పరిశ్రమలు, ఐటీ హబ్‌లు, ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఈ-సిటీ, ప్రాంతీయ మార్కెట్లకు రవాణా వేగవంతంతో పాటు సులువవ్వనుంది. ఈ రహదారి ద్వారా హైదరాబాద్ నుంచి రాబోయే భారత్ ఫ్యూచర్ సిటీకి రవాణా ఈజీగా మారనుంది. స్కిల్ యూనివర్సిటీ, సమీప పరిశ్రమల మధ్య సులభ రవాణాతో పాటు ఔషధ, ఎలక్ట్రానిక్స్, ఐటీ, అనుబంధ రంగాల్లో లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
రోడ్డు నిర్మాణ దశలో ఉపాధి సృష్టి
14 గ్రామాల గుండా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు (Radial Road Project)ఆర్థికాభివృద్ధి, ఉపాధికి దోహదపడనుంది. రోడ్డు నిర్మాణ దశలో ఉపాధి సృష్టి, ప్రాజెక్ట్ పూర్తయ్యాక ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఆస్కారముంది. సైకిల్ ట్రాక్స్, గ్రీన్‌బెల్ట్స్, ఫుట్‌పాత్‌లు, భవిష్యత్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు అనువుగా తీర్చిదిద్దనున్నారు. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం పూర్తయితే సెమీకండక్టర్, హార్డ్‌వేర్ ఉత్పత్తి పరిశ్రమలకు సులభ రవాణా. ఎగుమతులకు ప్రోత్సాహంతో ‘మేక్ ఇన్ తెలంగాణ’ లక్ష్యానికి చేరువవ్వనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్ణీత సమయానికి పూర్తి చేయడానికి కంకణం కట్టుకుంది.
Also Read: Sonam Wangchuk: పాక్ ఇంటెలిజెన్స్‌కు టచ్‌లో సోనమ్ వాంగ్‌చుక్!.. వెలుగులోకి సంచలనాలు