TS BJP: కొత్త టీమ్ ఎంపికలో రాంచందర్‌రావుకు చిక్కులు!
ఒక్కో పోస్ట్ కు భారీగా పోటీ
ఎవరికి వారుగా సంప్రదింపులు
నిమజ్జనం పూర్తయినా ముందడుగు పడని వైనం
పోటీ కారణంగానేనా? మరేదైనా కారణం ఉందా?
తెలంగాణ బీజేపీ సారధికి తలనొప్పిగా మారిన ఇష్యూ
అమావాస్య నేపథ్యంలో ఇంకొన్ని రోజులు పెండింగ్?
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ బీజేపీ (TS BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తన టీమ్ సెలక్షన్‌కు ఇబ్బంది పడుతున్నారా?, కొత్త జట్టు ఎంపికలో ఎంపీల నుంచి వస్తున్న ఒత్తిళ్లను ఆయన తట్టుకోలేక పోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఒక్కో పోస్టుకు ఆశావహులు భారీగా పోటీ పడుతున్న నేపథ్యంలో కొత్త కార్యవర్గం ఏర్పాటుకు మరింత సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ కమిటీ నియామకం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎవరికి వారుగా ఆశావహులు రాష్ట్ర అధ్యక్షుడిని సంప్రదిస్తుండటం, దీనికి తోడు కొందరు ఎంపీలు తమ అనుచరులకే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో తెలగాణ బీజేపీ కెప్టెన్‌కు తలనొప్పిగా మారినట్లుగా తెలుస్తోంది.
వినాయక చవితి పూర్తయ్యేలోపు నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తిచేయాలని రాష్ట్ర ట్ర నాయకత్వం భావించింది. కానీ నిమజ్జనం పూర్తయినా అందుకు అనుగుణంగా అడుగులు ముందుకు పడలేదు. కొత్త కార్యవర్గం ఏర్పాటుకు అమావాస్య సైతం అడ్డుగా ఉండటంతో మరికొద్ది రోజులు అంటే దాదాపు మరో రెండు వారాల వరకు ప్రక్రియ పెండింగ్ పడే అవకాశముందని తెలుస్తోంది. అమావాస్య అనంతరమే ఈ కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యే అవకాశముంది. కొత్త కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఉండనున్నారు. సంస్థాగత ప్రధాన కార్యదర్శితో కలిపితే నలుగురు ఉండనున్నారు. అయితే, ఈ పోస్టులకు పార్టీలో పెద్ద పోటీనే ఉండటంతో చాలా మంది లైన్‌లో ఉన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు పైరవీలు చేసుకుంటున్నారు.
Read Also- Saiyaara OTT: రూ. 600 కోట్లు కొల్లగొట్టిన సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?
బీజేపీలో అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శులకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. పార్టీ సంస్థాగత పనులు అన్నీ వారి ద్వారానే జరుగుతాయి. పార్టీ కార్యక్రమాలు, కార్యాచరణలో వారి భాగస్వామ్యం కీలకంగా ఉంటుంది. ఈ పోస్టుకు భారీగా పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలావుంచితే, గత కమిటీలో కార్యదర్శులుగా పనిచేసిన వారు ప్రధాన కార్యదర్శి పదవి అడుగుతున్నట్లుగా సమాచారం. ఉపాధ్యక్షులుగా పని చేసిన వారూ అదే పదవి కావాలని లాబీయింగ్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఒక నేత అయితే ప్రధాన కార్యదర్శిగా తన పేరు ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నట్లుగా సమాచారం. ఇంతపోటీ నేపథ్యంలో రాంచందర్ రావు ఎవరిని ఫైనల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ కొత్త కార్యవర్గం ఏర్పాటు ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనేది ఉత్కంఠగా మారింది.
Read Also- Ganesh Immersion: వెరీ గుడ్ ఆఫీసర్స్, స్టాఫ్.. సీఎం రేవంత్ అభినందనలు.. ఎందుకంటే?