TDP Telangana: పార్టీ అధిష్టానం స్పందించదు.. ప్రజాసమస్యలపై ప్రోగ్రామ్స్ ఇవ్వదు.. పార్టీలో కొనసాగాలో.. మారాలో తెలియక సతమతమవుతున్నారు. పార్టీ ఏపీలో అధికారంలో ఎండటంతో ఇకనైనా పార్టీ అధినేత ఇక్కడ దృష్టిసారిస్తారని, పనిచేస్తున్నవారికి పదవులు ఇస్తారనే ఆశతో ఇంకా కొంతమంది నేతలు కొనసాగుతున్నారు. ఏళ్లు గడుస్తున్నాయి.. తప్ప పార్టీపై మాత్రం ఆశించిన స్థాయిలో చంద్రబాబు(Chandrababu) దృష్టిసారించకపోవడంతో నేతల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.
పార్టీకి గడ్డుపరిస్థితులు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా టీడీపీ(TDP)కి ప్రజలు ఆదరణ చూపారు. 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాల్లో, మల్కాజ్ గిరి పార్లమెంట్, 2018 ఎన్నికల్లో నూ రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఆతర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ మళ్లీ టీడీపీ పోటీ చేయలేదు. చంద్రబాబు నాయుడు ఏపీ(AP)పైనే దృష్టిపెట్టడంతో తెలంగాణ(Telangana)లో పార్టీకి గడ్డుపరిస్థితులు ఎదుర్కుంటుంది. పార్టీకి సరైన నేతను అధ్యక్షుడిగా నియమించకపోవడం ఒకవైపు, నియమించిన వారికి పూర్తి బాధ్యతలు అప్పగించకపోవడం, ప్రతి విషయంలో చంద్రబాబు జోక్యం, స్పష్టమైన విధానంను తెలంగాణలో అమలు చేయకపోవడంతో కార్యకలాపాలు స్తంభించాయి. ఏ పార్టీలో కలిసిపోటీచేస్తారనే విషయంపైనా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఎంతసేపు నేతల నుంచి అభిప్రాయాలను సేకరించుడు తప్ప చంద్రబాబు మాత్రం తాను ఏం చేస్తున్నారనేది మాత్రం చెప్పకపోవడంతో పార్టీలో పనిచేస్తున్న నేతలు డైలమాలోనే కొనసాగుతున్నారు.
సమస్యలపై పోరాటాలు చేయాలా?
ఏపీలో టీడీపీ(TDP) అధికారంలో ఉండటంతో ఇకనైనా తెలంగాణలో పార్టీనిపై దృష్టిసారిస్తారనే ఆశతో నేతలు ఉన్నారు. 1.80లక్షల సభ్యత్వం సైతం చేశారు. అంతేకాదు కొన్ని కమిటీలు సైతం చేశారు. కానీ పార్టీబలోపేతంపై అధినేత దృష్టిపెట్టలేదు. కమిటీలు వేయాలని నేతలు చెబుతున్నప్పటికీ వారు ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలా? ఏ సమస్యపై స్పందించాలి? ఏ పార్టీకి అనుబంధంగా కలిసిపోవాలి? ఏ ఎన్నికల్లో పోటీ చేస్తుందనేదిమాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంకా నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో పార్టీలోని సీనియర్ నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. కనీసం వారిని ఆపేప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.
Also Read: Firecracker Accident: జోగిపేట పటాకుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
అధ్యక్షుడు లేక రెండేళ్లు
తెలంగాణలో టీడీపీకి అధ్యక్షుడు లేక రెండేళ్లు గడుస్తుంది. అయినప్పటికీ అధ్యక్షుడిని నియమించడంపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిసారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 అక్టోబర్ 30న పార్టీ అధ్యక్షపదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి నేటివరకు అధ్యక్షుడిని నియమించలేదు. ఇంకా పార్టీలో సమర్ధులైన నేతలు సైతం ఉన్నారు. పార్టీకోసం పనిచేస్తున్న సీనియర్ నేతలు ఉన్నారు. 30ఏళ్లకు పైగా పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న నాయకులు ఉన్నారు. ముఖ్యంగా అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహా, కాట్రాగడ్డ ప్రసూన ఇలా పలువురు నేతలు పార్టీలోనే కొనసాగుతున్నారు. అయినప్పటికీ పదవిని అప్పగించడంలో చంద్రబాబు ఆలోచిస్తుండటం వెనుక ఆంతర్యమేంటనేది హాట్ టిఫిక్ అయింది. మరోవైపు పెట్టుబడి దారుడు పార్టీలోకి వస్తున్నారని, ఆయనకు అధ్యక్ష పదవి అప్పగిస్తున్నట్లు లీకులు సైతం ఇచ్చారు. అదికూడా నెలలు గడుస్తుంది. ఇంకా పార్టీ అధ్యక్షపదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
పోటీకి ముందుకు వస్తున్నా.. ససేమిరా
రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా పోటీ చేసేందుకు నేతలు ముందుకు వస్తున్నారు. పార్టీకి బయోడేటా సైతం ఇస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం వారికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. పోటీపై క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం పోటీకి నందమూరి సుహాసిని, అరవింద్ కుమార్ గౌడ్ సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే పోటీచేయవద్దని, బీజేపీకి మద్దతు అని చంద్రబాబు నేతలతో పేర్కొన్నారు. దీంతో కేడర్ లో సైతం అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పటికే 80శాతం కేడర్ ఇతర పార్టీల్లో చేరారు. ఇప్పటికైనా పార్టీ అధినేత క్లారిటీ ఇస్తారా? రాబోయే స్థానిక సంస్థల్లోనైనా పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేదానిపైనా సస్పెన్స్ నెలకొంది. ఏది ఏమైన ఇప్పటికైనా చంద్రబాబు పోటీచేయడానికి సిగ్నల్ ఇస్తే మళ్లీ పార్టీ పుంజుకునే అవకాశం లేకపోలేదని, ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషించే అవకాశం సైతం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Diwali Safty Alert: దీపావళి వేళ వైద్యారోగ్య శాఖ మంత్రి కీలక ఆదేశాలు
