TDP And BJP: తెలంగాణలో ఏపీ పార్మూలా కోసం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత కొన్ని నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. దీనికి బీజేపీ నేతలు ససేమిరా అంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర నాయకత్వం ఓకే చెప్పినా తెలంగాణలోని సీనియర్ బీజేపీ నేతలు మాత్రం పొత్తు అవసరం లేదని ఇప్పటికే చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ పొత్తుతోనే ముందుకు పోవాలని పార్టీ అధినేత చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతుపై క్లారిటీ వస్తుందని, అదే రాబోయే ఏ ఎన్నికల్లోనైనా అదే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దానిపై రెండుమూడ్రోజుల్లో క్లారిటీ వస్తుందని తెలిసింది.
Also Read: Gatha Vaibhava: పవన్ కళ్యాణ్ అద్భుతమైన మాట చెప్పారు.. అందుకే తెలుగు నేర్చుకుని వచ్చానన్న హీరో!
15 అసెంబ్లీ స్థానాల్లో, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో టీడీపీకి కేడర్ ఉంది. కానీ నాయకత్వ లోపం ఉంది. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు సైతం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. కేడర్ సైతం స్తబ్దుగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాల్లో, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటికే హైదరాబాద్ లోని ఉప్పల్,ఎల్బీనగర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, సనత్ నగర్ ఇలా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో టీడీపీ కేడర్ ఉంది. అదే విధంగా ఉమ్మడి పది జిల్లాల్లోనూ పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పటిష్టమైన కేడర్ ఉంది. అయితేనప్పటికీ చంద్రబాబు ఫోకస్ అంతా ఏపీపై పెట్టడంతో తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. పటిష్టమైన రాష్ట్ర అధ్యక్షుడిని సైతం నియమించకపోవడంతో పార్టీ కేడర్ లో స్తబ్దత నెలకొంది.
చంద్రబాబు జూబ్లీహిల్స్ పోటీపై క్లారిటీ
అయితే జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నికలు రావడంతో పార్టీ నేతలు సుహాసిని, అరవింద్ కుమార్ గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం తెలిపినట్లు తెలిసింది. కానీ చంద్రబాబు మాత్రం పోటీ చేయవద్దని సూచించినట్లు తెలిసింది. అందులో భాగంగానే మంగళగిరిలోని సీఎం కార్యాలయంలో తెలంగాణకు చెందిన టీడీపీ పొలిట్ బ్యూరో, ముఖ్య నేతలతో భేటీ అయిన చంద్రబాబు జూబ్లీహిల్స్ పోటీపై క్లారిటీ ఇచ్చారు. పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. అయితే బీజేపీ నుంచి మాత్రం ఇప్పటి వరకు మద్దతు ఇవ్వాలని కోరలేదు. పార్టీ అధినేత చంద్రబాబును సైతం బీజేపీ నేతలు సంప్రదించలేదు. చివరకు రాష్ట్ర నేతలకు పొత్తు అంశంపై చర్చించలేదని సమాచారం. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం బీజేపీ నుంచి రిక్వేస్టు వస్తుందని ఆశాభావంతో ఉన్నారు.
బీజేపీతో పొత్తుకోసం పాకులాడటం ఏంటి
మరోవైపు జూబ్లీహిల్స్ పై బీజేపీ అభ్యర్థిని సైతం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అభ్యర్ధి ఖరారు కాగానే టీడీపీ మద్దతు ఇవ్వాలని కోరే అవకాశం ఉందని చంద్రబాబు నేతలతో అభిప్రాయపడినట్లు సమాచారం. వారి నుంచి ఇప్పటివరకు సానుకూలత రాకపోయినా చంద్రబాబు మాత్రం పొత్తుపై ఆలోచిస్తుండటంతో పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాబుతీరుపై కొంతమంది నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా వారిని పట్టించుకోకుండా బీజేపీతో పొత్తుకోసం పాకులాడటం ఏంటని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలోపేతంపై దృష్టిసారించకుండా, రాష్ట్ర కమిటీ వేయకుండా కాలయాపన చేయడంపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోటీచేస్తే విజయం సాధిస్తాం
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ఏ మండలం, ఏ గ్రామం బలంగా ఉంది. పోటీచేస్తే విజయం సాధిస్తాం.. కలిసి వచ్చే అంశాలు ఏంటి.. సుముఖంగా ఉన్న నేతలు ఎవరనే వివరాల సేకరణలో పార్టీ సీనియర్ నేతలు నిమగ్నం అయ్యారు. ఇప్పటికే సభ్యత్వ నమోదు చేసిన పార్టీ నాయకులు అదే స్థాయిలో క్షేత్రస్థాయిలో కమిటీలు సైతం వేశారు. ఇంకా పెండింగ్ లో ఉన్న కమిటీలను సైతం ప్రకటించాలని పార్టీ అధిష్టానం సూచించింది. జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాలు సైతం కంప్లీట్ చేసి పార్టీ యాక్టీవిటీ పెంచాలని ఆదేశించింది.
పార్టీ బలోపేతం ఎలా అవుతుంది?
ఇది ఇలా ఉంటే బీజేపీతో టీడీపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోతుందా? ఏపీ మాదిరిగా పొత్తుతో ముందుకు వెళ్తుందా? అనేది పార్టీ నేతల్లోనే సందిగ్ధం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలా విజయం సాధిస్తారనేది కూడా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పార్టీ రాష్ట్ర కమిటీకి సారధి లేకుండా పార్టీ బలోపేతం ఎలా అవుతుంది? పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? ప్రజల్లోకి ఎలా వెళ్తారు? ఏవరి ఆదేశాలు నేతలు పాటించాలి? అనేది తెలియక నేతల్లోనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ అంశాలన్నింటిని చంద్రబాబు తీరుస్తారు? లేకుంటే కాలయాపనతోనే కాలం వెళ్లదీస్తారా? అనేది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అయింది.
Also Read: Khammam District: ఆ ఊరులో నయా దందా.. అక్రమ వసూళ్లతో నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి బ్రేక్
