HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) పరువు ప్రతిష్టలు మరింత దిగజారిపోతున్నాయి. సంతకాల ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌ను బెదిరించిన పలు కేసుల్లో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ ఇటీవలే అరెస్ట్ చేసింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా రూ.170 కోట్లు గోల్‌మాల్ చేసినట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రావు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో హెచ్‌సీఏపై మరిన్ని ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ సంఘాల ప్రతినిధులు తమ తమ జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధులలో భారీగా అవినీతి జరిగిందని, నిధులు దుర్వినియోగం అయ్యాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. వీళ్లంతా సోమవారం ఫిర్యాదులు చేయగా, మంగళవారం కూడా మరికొన్ని జిల్లాల్లో ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తోంది. దీంతో, ఎప్పుడూ వివాదాలతో నడిచే హెచ్‌సీఏ ప్రక్షాళన ఇంకెప్పుడు జరుగుతుందని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
20 ఏళ్లుగా అవినీతి..
హెచ్‌సీఏలో గత 20 ఏళ్లుగా అవినీతి జరుగుతోందని, ప్రతి జిల్లాకు ఏడాదికి రూ.20 లక్షల ఇస్తున్నట్టుగా చూపిస్తున్నారు, కానీ అందివ్వడం లేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ఆరోపించింది. విశ్వసనీయత ఉన్న ఎర్నెస్ట్ అండ్ యంగ్ (E&Y) ఆడిట్ సంస్థ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిధులు ఉపయోగించినట్టుగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని ప్రస్తావించింది. ఈ ఆడిట్ రిపోర్టులను హైకోర్టు నియమించిన కమిటీ, సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలనా సంస్కరణల కమిటీ గుర్తించాయని చెబుతోంది. ఈ విషయాన్ని ఎన్నిసార్లు సిఫార్సు చేసినా ఇప్పటివరకు ఎన్నికైన ఒక్క హెచ్‌సీఏ బృందం పట్టించుకోలేదని విమర్శించింది. అక్రమాలకు పాల్పడుతున్న హెచ్‌సీఏ క్లబ్‌లపై ఫిర్యాదులు చేశామని టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి చెప్పారు. అవినీతి, బాధ్యతా రాహిత్యాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఇతర హెచ్‌సీఏ అనుబంధ క్లబ్‌లపై కూడా త్వరలోనే ఫిర్యాదులు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు చెందిన యువత క్రికెటర్లుగా మెరుదిద్దేందుకు ఉపయోగించాల్సిన నిధులను దారి మళ్లించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తాజాగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో టీసీఏ, హెచ్‌సీఏ మధ్య ఇప్పటికే ఉన్న వైషమ్యాలు మరింత పెరిగినట్టు అయింది.
Read Also- Health: మంచి ఫుడ్ తిన్నా అనారోగ్యమేనా?, అయితే ఇది మీకోసమే!
హెచ్‌సీఏ పరువు గంగలో: అజహరుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) పరువు గంగలో కలిపారని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ మండిపడ్డారు. ఇప్పటివరకు అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలకే పరిమితమైన హెచ్‌సీఏలో అరెస్టుల పర్వం మొదలవ్వడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రక్షాళన జరగాలని, ఇందుకు ఇదే సరైన సమయం అని ఆయన పేర్కొన్నారు. క్లబ్ స్థాయి నుంచి ప్రక్షాళన జరిగితే హెచ్‌సీఏకి మంచి రోజులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా రాజకీయాలు, పొలిటికల్ నేతల జోక్యాన్ని పక్కనపెట్టాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో సభ్యులు మొదలుకొని, ప్రెసిడెంట్ వరకు అందరూ క్రికెట్ గురించి తెలిసినవాళ్లే ఉండాలని ఆయన పేర్కొన్నారు.
Read Also- Viral News: విద్యార్థినిపై ఫిజిక్స్, బయాలజీ లెక్చరర్లు, వారి ఫ్రెండ్ అఘాయిత్యం
హెచ్‌సీఏను రద్దు చేయాలి: టీసీఏ అధ్యక్షుడు
హెచ్‌సీఏ బోర్డును పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ (TCA) కార్యదర్శి గురువారెడ్డి ఇటీవలే డిమాండ్ చేశారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఎవరున్నా అవినీతి జరుగుతూనే ఉందని, అందుకే, కొత్త బోర్డును ఎన్నుకోవాలని అన్నారు. ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ఇచ్చిన నిధులను సైతం జగన్మోహన్ రావు గోల్‌మాల్ చేసినట్టు ఆరోపించారు. జగన్మోహన్ రావు వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని ఆరోపించారు.