Swetcha Effect:
పరిహారంపై పరిహాసం కథనానికి ఖమ్మం కలెక్టర్ స్పందన
10 రోజుల్లో పూర్తిస్థాయి విచారణ
ఉద్యోగి దళారి అవతారంపై చర్యలకు అదనపు కలెక్టర్‌కు ఆదేశాలు
బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ
ఖమ్మం స్వేచ్ఛ: ‘పరిహారంపై పరిహాసం’ శీర్షికతో ‘స్వేచ్ఛ’ పత్రికలో (Swetcha Effect) గురువారం ప్రచురితమైన కథనానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ కథనంలో జిల్లాలో వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వరకు ‘స్వేచ్ఛ కథనం’పై చర్చలు జరిగాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి గ్రామంలో జేపీఆర్‌వోసీ-2 ప్రాజెక్ట్ భూసేకరణలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పంపిణీలో అవకతవకలు జరిగినట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇదే శాఖలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దళారీగా వ్యవహరించి అర్హుల జాబితాలో మార్పులు చేర్పులు చేశాడని ఆరోపణలు వచ్చాయి. 2016లో నిర్వహించిన సర్వే ప్రకారం 250 మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.12.69 లక్షల చొప్పున మొత్తం రూ.33.94 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని సిఫారసు చేశారు. అయితే, కల్లూరు ఆర్డీవో కార్యాలయం ఏర్పాటైన సమయంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి కొంతమంది రెవెన్యూ సిబ్బందికి ఆశ చూపించి కలెక్టర్ ఆదేశాలు లేకుండానే అర్హుల జాబితాను 229 మందికి కుదించాడనే ఆరోపణలు గ్రామస్తుల నుంచి వెల్లువెత్తాయి. దీంతో, నష్టపరిహారం రూ. 33.94 కోట్ల నుంచి రూ.17. 44 కోట్లకు తగ్గిందని గ్రామస్తుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. మరీ, ముఖ్యంగా వివాహిత మహిళలను ఈ జాబితా నుంచి తొలగించారని బాధితులు వాపోతున్నారు. ఇలా ఈ పరిహారంపై పరిహాసానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో ‘స్వేచ్ఛ’లో ప్రచురితం కావడంతో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విశేషంగా స్పందించారు.
Read Also- HYDRA: కీలక ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటన.. ఎందుకంటే?
10 రోజుల్లో పూర్తిస్థాయి విచారణ..
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భారీ అవకతవకలు జరిగిన విషయం ‘స్వేచ్ఛ కథనం’ ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఘటనపై 10 రోజుల్లో పూర్తిస్థాయి విచారణ చేపడతామని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా దళారి అవతారం ఎత్తడంపై చర్యలు తీసుకోవాలంటూ అదనపు కలెక్టర్‌కు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలు జారీ చేశారని విశ్వసనీయంగా తెలిసింది.
Read Also- Musi River Overflows: మూసీకి వరద ఉద్ధృతి.. తస్మాత్ జాగ్రత్త!
బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని అదనపు కలెక్టర్ అజయ్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ నుంచి తనకు ఆదేశాలు అందాయని వెల్లడించారు. ఘటనకు సంబంధించిన అవకతవకలకపై క్షేత్రస్థాయిలో స్థానిక తహసిల్దార్ ఆధ్వర్యంలో విచారణ చేయిస్తామన్నారు.

