Swetcha Effect: నకిలీ…నాసిరకం విత్తనాల దందాపై ‘స్వేచ్ఛ’ ఈనెల 30న ‘నకిలీలలు’ అన్న శీర్షికతో ఇచ్చిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రైతన్నల వెన్ను విరుస్తున్న ఈ అక్రమ వ్యాపారానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు నకిలీ, నాసిరకం విత్తనాలను అరికట్టటానికి కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లా, యూనిట్ స్థాయిల్లో జాయింట్ టాస్క్ ఫోర్స్ టీములను ఏర్పాటు చేసినట్టు డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ దందా చేస్తూ పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామన్నారు.
తొలకరి వానలు పడగానే రైతన్నలు సాగు మొదలు పెట్టే విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎనభై లక్షల ఎకరాలకు పైగా భూముల్లో పత్తి పంట సాగు చేస్తారు. దీనిని అవకాశంగా చేసుకుంటూ కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కొన్ని గ్యాంగులతోపాటు స్థానికంగా వ్యాపారాలు చేస్తున్న వారు పెద్ద స్థాయిలో నకిలీ, నాసిరకం విత్తనాలను మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు. దిగుబడి అధికంగా వస్తుందని నమ్మించటంతోపాటు కమీషన్ల ఆశ చూపించి వాటిని అమ్మేస్తున్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే నిషేధంలో ఉన్న బీజీ3 పత్తి విత్తనాలను కూడా విక్రయిస్తున్నారు. దీనిపై ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనాన్ని అందించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం నకిలీ, నాసిరకం విత్తనాలను అరికట్టటానికి పటిష్ట చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Rangareddy Medchal: ఎఫ్‌టీఎల్ ఎందాకా?.. ఈ జిల్లాల్లోనే 60శాతానికి పైగా చెరువుల్లో ఆక్రమణలు!
జిల్లా, యూనిట్ల స్థాయిల్లో...
ఈ క్రమంలోనే నకిలీ, నాసిరకం విత్తనాలను అరికట్టటానికి జిల్లా, యూనిట్ స్థాయిల్లో జాయింట్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. ఈ బృందాల్లో పోలీసులతోపాటు వ్యవసాయ, సీడ్ కార్పోరేషన్ కు చెందిన అధికారులు సభ్యలుగా ఉంటారు. తనిఖీలు జరపటం ద్వారా ప్రమాణాలకు అనుగుణంగా విత్తనాల జర్మినేషన్ జరిగిందా? లేదా?, విత్తనాలు స్వచ్ఛమైనవా? కాదా?, విత్తనాల్లో తేమ సరిగ్గా ఉందా? లేదా? అన్నది పరిశీలిస్తారు. ప్రాచుర్యంలో ఉన్న బ్రాండ్ల విత్తనాలకు డూప్లీకేట్ అమ్ముతున్నారా? అన్నది గమనిస్తారు. నిషేధంలో ఉన్న బీజీ3 రకం పత్తి విత్తనాల విక్రయాలు జరగకుండా చూస్తారు.
కాలపరిమితి ముగిసిన విత్తనాలు మార్కెట్లో రాకుండా చేస్తారు. నకిలీ, నాసిరకం విత్తనాలను అమ్ముతూ పట్టుబడిన వారిపై 1966 విత్తనాల చట్టం, 1983 సీడ్స్ (కంట్రోల్), 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అత్యవసర నిత్యావసర సరుకుల చట్టంతోపాటు బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తారు. ఈ కేసుల్లో 7సంవత్సరాలు…అంతకు మించి శిక్షలు పడతాయని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇక, నిందితులపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాల తయారీ, అమ్మకాలు, స్టోర్ చేయటానికి ఉపయోగించే ఆస్తులను బీఎన్ఎస్ యాక్ట్ 152(1)(బీ) సెక్షన్ ప్రకారం సీజ్ చేస్తామన్నారు. రైతన్నల బతుకులతో ఆడుకునే నకిలీ, నాసిరకం విత్తనాల వ్యాపారం చేస్తున్న వారిని ఎంతమాత్రం ఉపేక్షించమని స్పష్టం చేశారు.
ఇటీవల వికారాబాద్, గద్వాల్ తోపాటు రాచకొండ, వరంగల్, రామగుండం కమిషనరేట్ల పరిధుల్లో దాడులు జరిపి పెద్ద మొత్తంలో నకిలీ, నాసిరకం విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక, రైతులు కూడా గుర్తింపు ఉన్న డీలర్ల నుంచే విత్తనాలను కొనాలని సూచించారు. నకిలీ, నాసిరకం విత్తనాల దందా గురించి తెలిస్తే సమాచారం అందించాలని కోరారు. తెలంగాణ పోలీసులు అన్నదాతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు.
Also Read: Drugs Seized: డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్.. 3.05కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్!