Supreme Court: వీధి కుక్కల స్వైర విహారంపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కల దాడిలో ఎవరు గాయపడినా, చనిపోయినా చర్యలు తీసుకోవటంలో విఫలమైన పక్షంలో బాధితులకు పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఈ బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపింది. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారు సైతం ఇలాంటి సంఘటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. కుక్కలపై అంత ప్రేమ ఉంటే ఇళ్లకు తీసుకుపోయి పెంచుకోవాలని చెప్పింది. వీధి కుక్కల సమస్యలపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్(Justice Vikram Nath), జస్టిస్ సందీప్ మెహతా(Justice Sandeep Mehta), జస్టిస్ ఎన్.వీ.అంజారియా(Justice N.V. Anjaria)తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. క్రితంసారి విచారణ జరిపినపుడు వీధి కుక్కల నియంత్రణ కోసం ఉన్న నిబంధనల అమల్లో అధికార యంత్రాంగాలు విఫలమవుతున్నాయంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read: Medaram Jatara 2026: మేడారంలో ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
కుక్క కాటు కేసులో..
వీధి కుక్కల కారణంగా ఇటీవలి కాలంలో ఇద్దరు న్యాయమూర్తులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని పేర్కొంది. వీరిలో ఒకరికి వెన్నెముకకు గాయాలయ్యాయని తెలిపింది. కుక్క కాటు కేసులో పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుక్కలు ఎప్పుడు? ఏ మూడ్ లో ఉంటాయో? ఎవరైనా చెప్పగలరా అని ప్రశ్నించింది. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో కుక్క కాటు కేసులో ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంది. ఇక, వీధి కుక్కల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అందరూ కుక్కల గురించి మాట్లాడుతున్నారు. కోళ్లు, మేకలు జీవాలు కావా? వాటివి ప్రాణాలు కావా? అని ప్రశ్నించింది. తాజాగా మంగళవారం జరిపిన విచారణలో వీధి కుక్కల దాడుల్లో చిన్నారులు, వృద్ధులు గాయపడినా.. చనిపోయినా చర్యలు తీసుకోవటంలో విఫలమైతే పరిహారాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
Also Read: Gadwal District: భార్య కాపురానికి రావటం లేదని.. బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం!

