Stray Dogs: కుక్క అనేది విశ్వాసానికి ప్రతీక. అలాంటి కుక్క(Dog)ల వల్ల రాత్రిపూటే కాదు పగలు కూడా రోడ్లపై తిరగడానికి జనం భయపడే పరిస్థితి నెలకొన్నది. మెట్రో నగరాల్లో అయితే శునకాల బెడద విపరీతంగా ఉన్నది. పిల్లలు, వృద్ధులు ఎంతో మంది గాయాలపాలవుతున్నారు. కేవలం వీధి కుక్క(Dog)లే కాదు పెంపుడు శునకాలు కూడా దాడులకు పాల్పడుతుండడంతో గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్ట్‌మెంట్స్‌లో గొడవలు జరుగుతున్నాయి. అవి చినికి చినికి పెద్దవిగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఊరటనిచ్చేలా ఉన్నాయని సర్వత్రా వినిపిస్తున్నది.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా
సుప్రీంకోర్టు ఆదేశాలు
ఢిల్లీలో కుక్కలు, రేబిస్ వంటి కారణాలతో మరణాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తూ 8 వారాల్లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపి ప్రభుత్వ వాదనలే వింటామని, జంతు ప్రేమికులు, ఇతర సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వీలైనంత త్వరగా ఢిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. అంతేకాదు, షెల్టర్ల నుంచి అవి తప్పించుకోకుండా సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని, కుక్క కాటు కేసులకు సంబంధించి ఒక హెల్ప్ లైన్ ప్రారంభించాలని సూచించింది.
హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి
వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్(Hyderabad)లోనూ కుక్క(Dog)ల బెడద ఉన్నది. వీధి కుక్కలు, పెంపుడు శునకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ దాడులతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రేబిస్ ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఊరటనిచ్చేలా ఉన్నాయని హైదరాబాద్‌లోనూ ఇది అమలైతే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. అయితే, జంతు ప్రేమికులు మాత్రం భిన్నంగా వాదిస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
గేటెడ్ కమ్యూనిటీల్లో కుక్కల బెడదతో బాధపడుతున్నాం. బయట నుంచి వచ్చిన కుక్కలకు జంతు ప్రేమికులు ఫుడ్ ఇస్తుండడంతో అవి తరచూ వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయి. పగలు కూడా రోడ్లపై వెళ్లేందుకు భయపడే పరిస్థితి నెలకొన్నది. దీనిపై మున్సిపల్ కమిషనర్‌కు, ఎమ్మార్వోకు, పోలీస్ స్టేషన్(Police station)లో కూడా ఫిర్యాదు చేశాం. కమ్యూనిటీకి బయట షెల్టర్ ఉంది. కుక్కలకు ఫుడ్, ఇతర సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేశాం. కానీ, అక్కడకు వెళ్లకుండా కాలనీలోనే కుక్కలను పెంచి పోషిస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు చూడగా గతంలో జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీ ఫోన్ చేసి బెదిరించారు.
కుక్కలు ఎక్కడ సంచరిస్తాయో అక్కడే ఉంచాలని చెప్పారు. కుటుంబ నియంత్రణ లాంటివి ఎక్కడా చేయడం లేదు. పైగా, కుక్కలను నియంత్రించడంలో కొందరు విఫలం కావడంతో పిల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా మార్పు రావాలి. కుక్కల కంటే మనుషుల ప్రాణం విలువైనది. మున్సిపల్ అధికారులు, పోలీసులు దీనిపై ఫోకస్ చేయాలి. మా కమ్యూనిటీలో ఉన్న కుక్కలను షెల్టర్‌కు తరలించాలి. అక్కడే ఫుడ్, ఫీడింగ్ అందేలా చూడాలని కోరుతున్నాం.
Also Read: SC on Delhi-NCR: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!