Supreme Court: ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై స్టే ఇస్తూ సుప్రీం కోర్టు (Supreme Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పేర్కొంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయా గ్రామాల గిరిజనేతర నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మంగపేట మండలంలోని 23 గ్రామాలు గిరిజన పరిధిలో లేవని 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిని సవాల్ చేస్తూ 2013లో గిరిజన సంఘాలు హైకోర్టుకు వెళ్లాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు నిజాం ఆర్డర్ ఆధారంగా గిరిజన గ్రామాలుగా పరిగణించాలని తీర్పు ఇచ్చింది.
Also Read: Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో 70% వాటా కావాలి.. వాదనలు వినిపించిన మంత్రి ఉత్తమ్
గ్రామాలుగా ప్రకటించటాన్ని సవాల్
రాష్ట్రపతి ఉత్తర్వులను కాదని, నిజాం ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకుని గిరిజన గ్రామాలుగా ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ స్థానికులు సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించారు. 1950లో రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల్లో మంగపేట మండలంలోని 23 గ్రామాలు లేవని గిరిజనేతరుల తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనిపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన జస్టిస్ జే.కే.మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. దాంతోపాటు మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Afghan Boy: విమానానికి వేలాడుతూ.. భారత్‌కు వచ్చిన అఫ్గాన్ బాలుడు.. వీడు మామూలోడు కాదు!
హైకోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్.. నివేదికలో తన పేరు తొలగించాలని పిటిషన్
కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారిణి హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ నివేదిక నుంరి తన పేరును తొలగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో స్మితా సబర్వాల్ అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో పని చేసిన విషయం తెలిసిందే. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ జరిపిన పీ.సీ.ఘోష్ కమిషన్ ఆమె నుంచి కూడా వాంగ్మూలాన్ని తీసుకుంది.
బ్యారేజీలతో తనకు ఎలాంటి సంబంధం లేదు
విచారణ అనంతరం కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికలో స్మితా సబర్వాల్ పేరును కూడా ఉదహరించింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్మితా సబర్వాల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. పర్యవేక్షణ, నాణ్యతను పరీక్షించటంలోనూ తన పాత్ర లేదని తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతి కోసం వచ్చే పత్రాలను పరిశీలించటం, సీఎంకు వివరించటం, లోపాలు ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్లటమే తన బాధ్యత అని తెలియచేశారు. జిల్లాల పర్యటనలకు వెళ్ఇ కలెక్టర్లతో సమావేశాలు జరిపి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించటమే తనకు అప్పగించిన బాధ్యతలు అని పేర్కొన్నారు.
గ్రూప్ 1 తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్
గ్రూప్ 1 పరీక్షలపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మరో అప్పీల్ పిటిషన్ దాఖలైంది. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన ఓ అభ్యర్థి మంగళవారం ఈ అప్పీల్ పిటిషన్ ను దాఖలు చేశారు. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలంటూ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. దీనిని ఛీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ కోర్టు మెయిన్ పత్రాల మార్కులను రీ వెరిఫికేషన్ చేయాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి 8 నెలల గడువు ఇచ్చిన కోర్టు ఈలోపు రీ వెరిఫికేషన్ చేయకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని పేర్కొంది. ఈ తీర్పుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, గ్రూప్ 1 పరీక్షకు ఎంపికైన ఓ అభ్యర్థి తాజాగా మరో అప్పీల్ పిటిషన్ దాఖలు చేయగా దానిని సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
Also Read: Lord Hanuman: ఇక దేవుళ్ల వంతు.. హనుమంతుడిపై నోరు పారేసుకున్న ట్రంప్ పార్టీ నేత