Telangana: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అయితే, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీకి జంప్ అయిన నేతలపై అనర్హత వేటు వేయాలని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరు పిటిషన్లు వేశారు. వీటిపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిగింది. ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేయగా, తాజాగా సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు వెలువరించింది.
హైకోర్టు తీర్పు కొట్టివేత
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మూడు నెలలలోపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలని అనడం సమంజసం కాదని, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ మాదిరి ఉంటుందని వ్యాఖ్యానించింది. రాజకీయ ఫిరాయింపులు జాతీయ స్థాయిలో ఉన్నాయని, దీనికి అడ్డుకట్ట పడాలని అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కకు పెడుతున్నామని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పుడున్న యంత్రాంగాన్ని పార్లమెంట్ సమీక్షించాలని వ్యాఖ్యానించింది. ఇలాంటివి ఏళ్ల తరబడి సాగడం అర్థరహితమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఇప్పుడేం మాట్లాడను
సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడేందుకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరాకరించారు. కోర్టు ఏం తీర్పు చెప్పిందో తనకు తెలియదని, కోర్టులో ఉన్న అంశంపై మాట్లాడలేనని అన్నారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో పోచారం ఒకరు. గతంలో చాలా సార్లు అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పారు. ఓట్లు వేసి గెలిపించిన వారి నమ్మకాన్ని నిలబెట్టడానికే పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు.
ఈ తీర్పు మేం ఊహించిందే..
ఫిరాయింపులపై సుప్రీం తీర్పుపై ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు షబ్బీర్ అలీ స్పందించారు. తాము అనుకున్న తీర్పే వచ్చిందని, సుప్రీంకోర్టు, అసెంబ్లీ రెండు ఇండిపెండెంట్ బాడీస్ ఎవరి పవర్ వాళ్లకు ఉంటాయని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, అనర్హత వేటు తాము వేయలేము అంటూ సుప్రీం చెప్పిందన్నారు. సమయం తక్కువ ఉంది కాబట్టి స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని, పార్టీ ఫిరాయింపులు ఆటగా మార్చింది కేసీఆర్ అని విమర్శించారు. తనతోపాటు 10 ఏళ్లలో 43 మందిని ఇబ్బంది పెట్టన చరిత్ర ఆయనకుందని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను స్వాగతిస్తున్నానని తెలిపారు.
మేం స్వాగతిస్తున్నాం..
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల వ్యవధి లోపల స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నామని తెలిపారు. అయితే, స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే ఏం అవుతుందో సుప్రీంకోర్టు చెప్పలేదని వ్యాఖ్యానించారు.
Read Also- Dharmasthala: 6వ స్థలంలో మానవ అవశేషాలు గుర్తింపు.. ఆ వ్యక్తివేనా?
అనర్హత వేటు వేయాలి
సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇంకా విచారణ అవసరం లేదని, స్పీకర్ వెంటనే వారిని డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. అంతిమంగా ధర్మం, సత్యం గెలించిందని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పులను తప్పుదోవ పట్టించాలన్నా కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొని అంతిమంగా సత్యమే గెలిచిందని పేర్కొన్నారు.
స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రియాక్ట్ అయ్యారు. న్యాయ నిపుణులతో చర్చించి అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గతంలోనే నోటీసులిచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Read Also- Gujarat Crime: ఈ కంత్రి బామ్మ నేర చరిత్ర తెలిస్తే.. ఫ్యూజులు ఎగరడం పక్కా!