Supreme Court: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) తెలంగాణ శాసనసభ స్పీకర్ (Gaddam Prasad Kumar) గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని పేర్కొంటూ తగు చర్యలు తీసుకోని పక్షంలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. శుక్రవారం వచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
బీఆర్ఎస్ ఫిర్యాదుతో
తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటిలోకి చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై జడ్జిలు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్నది. శుక్రవారం కేసు మరోసారి ధర్మాసనం ముందుకు రాగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్‌లపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కోళ్లు, మేకలు జీవాలు కావా..?
ఇంకా మిగిలింది ముగ్గురే
స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపిస్తూ బీఆర్ఎస్ నుంచి ఫిరాయించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురి అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆయనకు కంటి ఆపరేషన్ జరగడంతో ఆస్పత్రిలో ఉన్నారన్నారు. కొత్త అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ వచ్చినందును మిగితా ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడంలో ఆలస్యమైందని తెలిపారు. ఇప్పటివరకు స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో కోర్టుకు అందజేశారు. మిగితా ముగ్గురికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి 4 వారాల సమయం ఇవ్వాలని కోరారు. అయితే, విచారణను 2 వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం కేసులోని పురోగతిని పరిశీలించి అవసరమైతే మరో 2 వారాల గడువు పెంచుతామని పేర్కొంది.
పదే పదే అదేనా?
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి గతేడాది కాలంగా చెప్పిందే చెబుతున్నారని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గతంలోనే 3 నెలల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
Also Read: Supreme Court: సుప్రీం తీర్పుపై ఉత్కంఠ.. నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ..!

