PG Students: రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా పీజీ చేసిన వారుండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్సిటీ లక్ష్యంతో ఉంది. అందుకు అనుగుణంగా కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీగెట్) ను ప్రతిఏటా నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులు మాత్రం అనుకున్న స్థాయిలో పీజీ వైపు మొగ్గుచూపడంలేదని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే గత విద్యాసంవత్సరానికి సీపీగెట్ ద్వారా కేవలం 21,560 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు.
తెలంగాణలో మొత్తం 46, 742 సీట్లు ఉన్నాయి. కానీ అందులో సగం సీట్లు కూడా నిండకపోవడం గమనార్హం. 21,560 మంది చేరగా 25,182 ఖాళీగా ఉండిపోయాయి. అయితే విద్యార్థుల సౌకర్యార్థం 2025-26 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వం మరో 4 వేల వరకు సీట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ సీట్ల పెంపుతో దాదాపు 50 వేల సీట్లకు చేరే అవకాశముంది.
Also Read: TG on Panchayats: గ్రామ పంచాయతీల్లో 17 రకాల లక్ష్యాలు.. సక్సెస్ చేసేలా ప్రణాళికలు
రాష్ట్రం మొత్తంలో 297 కాలేజీలు
తెలంగాణలోని పలు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో చేరేందుకు కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీగెట్) ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అయితే రాష్ట్రం మొత్తంలో 297 కాలేజీలు ఉండగా ఇందులో 249 కాలేజీల్లో అఫిలియేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 108 కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అయినా విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరేందుకు మొగ్గుచూపడం లేదు. ఉద్యోగాలు, వ్యాపారం, ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్న కారణంగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం మరో 4 వేల సీట్లు అదనంగా కేటాయిస్తుండటంతో ఇప్పటికైనా విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరేందుకు మొగ్గు చూపుతారా? లేదా? అనేది చూడాలి.
అప్లికేషన్ల ప్రక్రియ ఈనెల 18 నుండి
పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే సీపీగెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాగా అప్లికేషన్ల ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభంకానుంది. వచ్చేనెల 17 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రూ.500 లేట్ ఫీజుతో జూలై 24 వరకు అప్లికేషన్ కు చాన్స్ ఇచ్చారు. అలాగే రూ.2000 ఆలస్య రుసుముతో వచ్చేనెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టంచేశారు. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Also Read: HYDRA Commissioner: వరద ముంపు ప్రాంతాల్లో.. హైడ్రా కమిషనర్ పర్యటన!