Local Body Elections: తెలంగాణలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని (Rani kumudini) ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలను ఈసీ నిర్వహించనుంది.
ఐదు విడతల్లో ఎన్నికలు
లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబంధించి అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా ప్రకటనలో తెలియజేసింది. మెుత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ముందుగా జరగబోయే ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలను రెండు విడుతల్లో ఈసీ నిర్వహించంది. అక్టోబర్ 23, 27 తేదీల్లో రెండు దఫాలుగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు పంచాయతీ ఎన్నిలను మూడు విడతల్లో ఈసీ జరపనుంది. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోలింగ్ జరిగిన రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రిజల్ట్స్ ఇవ్వనున్నట్లు షెడ్యూల్ లో వివరించింది.
ఓటర్ జాబితాను సిద్ధం చేశాం: ఈసీ
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు అనుమతి ఇచ్చిందన్న ఆమె.. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల ఖాళీలకు సంబంధించిన వివరాలు గెజిట్ నోటిఫికేషన్ రూపంలో ఆదివారమే తమకు అందాయని చెప్పారు. మరోవైపు ఇప్పటికే ఓటర్ల జాబితాను సైతం సిద్దం చేశామని.. వార్డు, గ్రామం, ఎంపీటీసీ, జడ్పీటీసీ వారీగా వాటిని విడుదల చేశామన రాణి కుముదిని తెలిపారు.
Also Read: Asia Cup 2025: పాక్‌పై సూపర్ విక్టరీ.. ట్రోఫీ తీసుకునే వేళ హైడ్రామా.. ఇది కదా టీమిండియా అంటే!
బీసీలకు పదవుల పండగ
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన ద్వారా సేకరించిన వివరాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. బిల్లులు, ఆర్డినెన్స్ ల పేరుతో ఎంత కృషి చేసినా గవర్నర్, రాష్ట్రపతి వద్ద అవి పెండింగ్ లో ఉండటంతో.. రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక జీవోనూ జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,751 సర్పంచ్ పదవుల్లో బీసీలకు పెంచిన 42 శాతం రిజర్వేషన్ల మేరకు 5,355 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక 1.11 లక్షల గ్రామ పంచాయతీ వార్డు స్థానాల్లో 46,965 పదవులు, అర్బన్ వార్డుల్లో 3,385 స్థానాలకుగానూ 1,422 లభించనున్నాయి. మరోవైపు 5,773 ఎంపీటీసీ స్థానాల్లో2,425 బీసీలకు దక్కే ఛాన్స్ ఉంది. ఇక చెరో 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు చెరో 238 స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.